తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి మండలానికి ఒక విజయ డెయిరీ పార్లర్‌ను మహిళా సంఘానికి కేటాయించనున్నారు. మున్సిపాలిటీల్లో అయితే రెండు పార్లర్లు చొప్పున మహిళలకు అందించేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను వారం నుంచి పది రోజుల్లో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమలు కోసం అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
విజయ డెయిరీ పార్లర్ పొందాలనుకునే మహిళా సంఘాలు ముందుగా పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, పార్లర్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని మహిళా సంఘాలే గుర్తించుకోవాలి. అనంతరం రూ.5,000 చెల్లిస్తే అధికారికంగా పార్లర్ మంజూరు చేస్తారు.
ఒక్కో విజయ డెయిరీ పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ భారాన్ని మహిళలపై వేయకుండా ప్రభుత్వం రుణ సదుపాయాలను అందించేందుకు ముందుకొచ్చింది. అవసరమైన లోన్లు మంజూరు చేసి, వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థికంగా సహాయం చేయనుంది. దీని వల్ల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.
ఈ పార్లర్లలో విజయ డెయిరీ సంస్థకు చెందిన పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, తాగునీటి బాటిళ్లు వంటి ఉత్పత్తులనే విక్రయించాల్సి ఉంటుంది. విక్రయాల ద్వారా వచ్చే లాభం పూర్తిగా మహిళా సంఘాలకే దక్కుతుంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు విజయ డెయిరీ పార్లర్లతో మరో ముందడుగు వేసిందని అధికారులు తెలిపారు. ఇది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయపడ్డారు.