కొత్తగా వివాహం చేసుకునే దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నూతన వధూవరులు దాంపత్య జీవితాన్ని శుభప్రదంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆశీర్వచన ప్యాకేజీని టీటీడీ అందిస్తోంది. ఇందులో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మావతి అమ్మవారి ఫోటోలు, వేద ఆశీర్వచనాలతో కూడిన పత్రికతో పాటు “కల్యాణ సంస్కృతి” అనే పుస్తకాన్ని పంపిస్తోంది. ప్రతి ఏడాది లక్షకు పైగా వివాహ శుభలేఖలు టీటీడీకి అందుతుండగా, అంతమంది నూతన జంటలకు స్వామివారి దీవెనలు చేరుతున్నాయని అధికారులు తెలిపారు.
వివాహం అనేది గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే అత్యంత పవిత్రమైన ఘట్టమని టీటీడీ పేర్కొంది. వివాహ ఆచారాల్లో భాగంగా జరిగే కంకణధారణ, తలంబ్రాల వంటి సంప్రదాయాలకు విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని వివరించింది. ఉపద్రవాల నుంచి రక్షించే రక్షాబంధనంగా కంకణాన్ని వరుడి కుడిచేతికి, వధువు ఎడమచేతికి ధరింపచేస్తారని, ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కుంకుమ, కంకణాన్ని టీటీడీ పంపిస్తోందని తెలిపింది. అలాగే దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని, సిరిసంపదలు కలగాలని కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలను కూడా అందజేస్తున్నట్లు వెల్లడించింది.
నూతన వధూవరులకు వివాహ వ్యవస్థ, దాంపత్య బాధ్యతలు, సంప్రదాయ విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతో “కల్యాణ సంస్కృతి” అనే ప్రత్యేక పుస్తకాన్ని కూడా టీటీడీ పంపిస్తోంది. శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రాలతో కూడిన వేద ఆశీర్వచన పత్రికను టీటీడీ కార్యనిర్వహణాధికారి పేరిట పంపడం విశేషం. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఉన్న శుద్ధ ప్రతి (తపాలా) విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం లక్షకు పైగా నూతన జంటలకు ఈ పవిత్ర ఆశీస్సులు అందిస్తున్నారని టీటీడీ తెలిపింది.
శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకునే నూతన వధూవరులు తమ పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను “కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి – 517501” కు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257 ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవం మరింత నాణ్యంగా చేరాలన్న ఉద్దేశంతో ఎస్వీబీసీ ఛానల్‌ను హెచ్‌డీ క్వాలిటీతో ప్రసారం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. హెచ్‌డీ అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్, అదనపు ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ కేటాయింపులు, ఉద్యోగుల వైద్య సౌకర్యాల విస్తరణపై కూడా కీలక సూచనలు చేశారు.