ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైదరాబాద్‌ను ఐటీ మ్యాప్‌పై నిలబెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని మరోసారి రంగంలోకి దిగారు. కాలానికి ముందే ఆలోచించడం, రాబోయే మార్పులను ఇప్పుడే గుర్తించడం చంద్రబాబు నాయుడి ప్రత్యేకతగా చెప్పుకుంటారు. అదే లక్షణం ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. రేపటి ప్రపంచం ఏ దిశగా వెళ్తోంది? అన్న ప్రశ్నకు సమాధానంగా సీఎం చంద్రబాబు యువత ముందు పెట్టిన విజన్ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమరావతిలో నిర్వహించిన ‘క్వాంటం టాక్’ కార్యక్రమం సాధారణ సమావేశంలా కాకుండా, ఒక రకంగా భవిష్యత్ తరగతిలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన టెక్ విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందా? అనే పాత ప్రశ్నను పక్కన పెట్టి ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ప్రపంచం మనవైపు చూస్తుంది? అన్న కోణంలో ఆలోచించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. క్వాంటం, ఏఐ అనేవి భవిష్యత్ మాటలు కావు, ఇప్పటికే ప్రపంచాన్ని మార్చుతున్న వాస్తవాలు అని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని ముందుకు తీసుకెళ్లినప్పుడు చంద్రబాబు అనుసరించిన వ్యూహం అప్పట్లో చాలామందికి అర్థం కాలేదు. కానీ కాలక్రమంలో అదే వ్యూహం హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చింది. ఇప్పుడు అదే ఫార్ములాను విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అమలు చేయాలన్నది ఆయన ఆలోచన. ఈసారి లక్ష్యం ఐటీ మాత్రమే కాదు… క్వాంటం, డీప్ టెక్, ఏఐ. “కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనే దశ నుంచి ముందే నైపుణ్యం ఉంటే కంపెనీలే వస్తాయి అనే దిశగా పాలసీని మలుస్తున్నారు.
ఈ విజన్‌లో కీలక భాగంగా విశాఖపట్నాన్ని ఏఐ హబ్‌గా, అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు తెరపైకి వచ్చాయి. ఇది కేవలం బోర్డులపై కనిపించే పేర్లుగా కాకుండా, నిజంగా పరిశోధనలు జరిగే ప్రాంతాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని నెలల్లో రాష్ట్రానికి క్వాంటం కంప్యూటింగ్ మెషిన్ రానుండటం, మరో ఎనిమిది నెలల్లో క్వాంటం టవర్లు సిద్ధం కానుండటం ఈ ప్రయత్నాలకు స్పష్టమైన దిశను చూపిస్తోంది.
క్వాంటం టాక్‌లో సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సాధారణ ప్రభుత్వ ప్రెజెంటేషన్‌లా కాకుండా విద్యార్థులను ఆలోచింపజేసేలా సాగింది. “డిగ్రీ సర్టిఫికెట్ కాదు, స్కిల్ అసలైన సంపద అన్న సందేశాన్ని పదే పదే గుర్తు చేశారు. ప్రభుత్వ పాలసీలను కేవలం నోటిఫికేషన్లుగా కాకుండా, యువత జీవితాలను మార్చే అవకాశాలుగా చూడాలని సూచించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం లైన్లో నిలబడటం కాదు, కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు మొదలుపెట్టే ధైర్యం ఉండాలని చెప్పారు.
ఈ మొత్తం ప్రయత్నాన్ని చూస్తే, ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, ఒక దీర్ఘకాల ప్రయాణానికి వేసిన తొలి అడుగులా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ యువతను ప్రపంచ స్థాయి టెక్ నిపుణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం వెనుక కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు తీసుకురావాలన్న ఆశ కూడా దాగి ఉంది. ఐటీతో మొదలైన ప్రయాణం క్వాంటం, ఏఐ వరకు చేరితే… రేపటి రోజుల్లో “ఏపీ నుంచి ప్రపంచానికి” అన్న మాట కొత్త నినాదంగా మారినా ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… ఈ విజన్‌ను యువత ఎంతవరకు అందిపుచ్చుకుంటుంది? ప్రభుత్వం వేసిన ఈ బాటలో నడిస్తే, ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి టెక్ దిశానిర్దేశం చేసే స్థాయికి చేరుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.