ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. సెలూన్లు (కటింగ్ షాపులు) నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) ఇప్పటికే జారీ కాగా, నవంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలన్న విషయంపై చాలామందికి స్పష్టత లేకపోవడంతో, కొందరు దళారులను ఆశ్రయించి మోసపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని పొందాలంటే లబ్ధిదారుడు ముందుగా తన పరిధిలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఒక రిక్వెస్ట్ లెటర్ (విజ్ఞాపన పత్రం) సిద్ధం చేసుకోవాలి. ఈ దరఖాస్తుతో పాటు లేబర్ లైసెన్స్, సెలూన్ షాప్ ఎదుట లబ్ధిదారుడు నిలబడి ఉన్న ఫోటో, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. అదనంగా సెలూన్ షాప్‌కు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఉంటే దానిని కూడా సమర్పించాలి. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే అఫిడవిట్ జతచేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ అన్ని పత్రాలను ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు సెట్‌ను విద్యుత్ శాఖ ఏఈకి సమర్పించాలి. అనంతరం ఏఈ ఆ దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ అధికారుల వద్దకు పంపిస్తారు. అక్కడ నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారుడి సెలూన్‌కు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తారు. దరఖాస్తు ప్రక్రియ మొత్తం అధికారికంగానే జరుగుతుందని, మధ్యవర్తులు లేదా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత విస్తరించింది. గతంలో నెలకు 150 యూనిట్లుగా ఉన్న ఉచిత విద్యుత్ పరిమితిని 200 యూనిట్లకు పెంచుతూ జీఓ జారీ చేసింది. నాయీ బ్రాహ్మణులతో పాటు చేనేత కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. హ్యాండ్లూమ్ యూనిట్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్న వృత్తిదారులపై ఆర్థిక భారం తగ్గి, వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.