కొత్త ఏడాదిలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఖర్చుల భారం పెరగనుంది. ఆన్‌లైన్ లావాదేవీలపై కొత్తగా అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, యూపీఐ వాలెట్లు, ట్రావెల్ ఖర్చులు, నగదు చెల్లింపులపై చార్జీలు పెంచనున్నట్లు తెలిపింది. ఈ మార్పులను 2025 జనవరి – ఫిబ్రవరి మధ్య దశలవారీగా అమలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్న వినియోగదారులకు ఇది పెద్ద షాక్‌గా మారింది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే లావాదేవీలపై 2 శాతం అదనపు ఛార్జీ విధించనున్నారు. అలాగే అమెజాన్ పే, పేటీఎం వంటి యూపీఐ వాలెట్లలో రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేస్తే 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. అంతేకాదు, ట్రావెలింగ్ ఖర్చులు రూ.50,000 దాటితే అదనంగా 1 శాతం చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లించినా రూ.150 అదనంగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
రివార్డు పాయింట్ల విషయంలోనూ కీలక మార్పులు చేసింది ఐసీఐసీఐ బ్యాంక్. ఇప్పటివరకు ‘ఎమెరాల్డ్ మెటల్’ వంటి ప్రీమియం క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవలు, ఇంధనం, అద్దె, పన్నులు, వాలెట్ లావాదేవీలపై రివార్డు పాయింట్లు లభించేవి. ఇకపై ఈ విభాగాల్లో రివార్డులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. అలాగే రవాణా ఖర్చులపై నెలకు గరిష్ఠంగా రూ.20,000 వరకే రివార్డు పాయింట్లు లభిస్తాయని తెలిపింది. అదనంగా అడాన్ కార్డు కోసం రూ.3,500 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.
వినోదం, ఆఫర్ల విషయంలోనూ కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. బుక్‌మైషోలో ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ పొందాలంటే గత మూడు నెలల్లో కనీసం రూ.25,000 ఖర్చు చేసి ఉండాల్సిందేనని షరతు పెట్టింది. అంతేకాదు, ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డు హోల్డర్లకు ఫిబ్రవరి నుంచి ఈ ఆఫర్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మార్పులతో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇకపై ప్రతి లావాదేవీ ముందు అదనపు ఖర్చులను జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.