పండుగ సీజన్ నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీపై కీలక అంచనాలను సవరించింది. తాజా అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ దుబాయ్ విమానాశ్రయ చరిత్రలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటిగా నిలవనుంది. ఆ ఒక్కరోజే దాదాపు 3 లక్షల 12 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ అంతర్జాతీయ ప్రయాణాల డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
వాస్తవానికి డిసెంబర్ 20వ తేదీన అత్యధికంగా ప్రయాణికుల రద్దీ ఉంటుందని ముందుగా అధికారులు అంచనా వేశారు. ఆ రోజు సుమారు 3 లక్షల 9 వేల మంది ప్రయాణిస్తారని భావించారు. కానీ పండుగ సెలవులను దుబాయ్‌లో గడపాలనుకునే విదేశీ పర్యాటకులు, అలాగే సెలవుల కోసం తమ స్వదేశాలకు వెళ్లే నివాసితుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో అంచనాలను తిరిగి సమీక్షించారు. దీంతో డిసెంబర్ 28వ తేదీ అత్యంత బిజీ డేగా మారనుందని తాజాగా ప్రకటించారు.
డిసెంబర్ నెల మొత్తం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలోనే అత్యంత రద్దీ నెలగా నిలిచే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 87 లక్షలను దాటే అవకాశం ఉందని తెలిపారు. రోజుకు సగటున లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాన్ని ఉపయోగించనున్న నేపథ్యంలో, టెర్మినల్స్, చెక్-ఇన్ కౌంటర్లు, ఇమిగ్రేషన్, భద్రతా విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. అదనపు సిబ్బంది, టెక్నికల్ సపోర్ట్, ప్రయాణికుల మార్గనిర్దేశం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలను కలుపుతూ గ్లోబల్ ట్రాన్సిట్ హబ్‌గా మారిన ఈ విమానాశ్రయం పండుగ సీజన్‌లో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని, ఆన్‌లైన్ చెక్-ఇన్ వంటి సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ రద్దీ దుబాయ్ నగరం పర్యాటకంగా ఎంతగా ఆకర్షణగా మారిందో మరోసారి రుజువు చేస్తోంది.