Hyderabad: హైదరాబాద్‌లో క్విక్ కామర్స్ స్టోర్లపై భారీ తనిఖీలు.. 4 లైసెన్సులు సస్పెండ్!

Hyderabad: ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే సరుకులు ఇంటి వద్దకు చేరుతున్నా.. వాటి నిల్వ, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెలంగాణ ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని క్విక్ కామర్స్ సంస్థలకు చెందిన డార్క్ స్టోర్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఫంగస్ పట్టిన కూరగాయలు, పురుగులు, ఎలుకల సంచారం వంటి పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.

Hyderabad
Hyderabad

హైదరాబాద్ డార్క్ స్టోర్లలో కలకలం.. జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ కేంద్రాల్లో ఎక్స్‌పైరీఅయిన ఆహారం..

ఫంగస్ పట్టిన కూరగాయలు.. పురుగులు, ఎలుకల బెడద! హైదరాబాద్ డార్క్ స్టోర్లపై TG SAFE కొరడా..

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే సరుకులు ఇంటి వద్దకు చేరుతున్నా.. వాటి నిల్వ, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెలంగాణ ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని క్విక్ కామర్స్ సంస్థలకు చెందిన డార్క్ స్టోర్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఫంగస్ పట్టిన కూరగాయలు, పురుగులు, ఎలుకల సంచారం వంటి పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.

ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సంస్థల లైసెన్సులను తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) సస్పెండ్ చేసింది. సంబంధిత కేంద్రాలు వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.

29 డార్క్ స్టోర్లలో తనిఖీలు 
కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని డార్క్ స్టోర్లపై TG SAFE ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందుకోసం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ప్రతి బృందంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. మొత్తం 29 డార్క్ స్టోర్లను అధికారులు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణ, పరిశుభ్రత, లేబులింగ్, ఇతర ఆహార భద్రతా ప్రమాణాలను ప్రధానంగా పరిశీలించారు.

ఫంగస్ పట్టిన కూరగాయలు
తనిఖీల సందర్భంగా పలు కేంద్రాల్లో ఆహార భద్రతకు సంబంధించిన తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానంగా.. గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత లోపం, ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయకపోవడం, సరైన పద్ధతిలో ఆహారాన్ని నిర్వహించకపోవడం, ఫంగస్ సోకిన కుళ్లిన కూరగాయలు, ఆహార లేబులింగ్, ప్రదర్శన నిబంధనల ఉల్లంఘన, పురుగులు, ఎలుకల సంచారం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కిరాణా సరుకులు, ఆహార పదార్థాలను వేగంగా వినియోగదారులకు చేరవేసే ఈ డార్క్ స్టోర్లలోనే ఇలాంటి పరిస్థితులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిల్వ సరిగా లేకపోతే ఆహార నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నాలుగు లైసెన్సులు సస్పెండ్
తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నాలుగు కేంద్రాలపై TG SAFE కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు లైసెన్సులను సస్పెండ్ చేసి, సంబంధిత సంస్థలు వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.

అదే సమయంలో మరిన్ని ఉల్లంఘనలపై 12 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, 9 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారో వివరణ ఇవ్వాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది.

29 ఆహార నమూనాలు సేకరణ
అనుమానాస్పదంగా కనిపించిన ఆహార పదార్థాల నుంచి అధికారులు 29 నమూనాలను సేకరించారు. వీటిని ప్రయోగశాలలకు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆహార భద్రతకు సంబంధించిన నిర్దేశిత ప్రమాణాలను ఆ నమూనాలు అందుకుంటున్నాయా లేదా అనే విషయం ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా తేలనుంది. పరీక్షల ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తనిఖీలు మరింత విస్తరించే అవకాశం 
క్విక్ కామర్స్ సేవలు నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డార్క్ స్టోర్లలో ఆహార నిల్వ, పరిశుభ్రత, నిర్వహణపై TG SAFE ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా అధికారులు సేకరించి, ప్రచురణతో పాటు అవసరమైన తదుపరి చర్యల కోసం పంపించారు. వినియోగదారులకు నేరుగా చేరే ఆహార పదార్థాల విషయంలో నిల్వ, పరిశుభ్రత, గడువు వంటి అంశాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదన్న విషయాన్ని హైదరాబాద్ డార్క్ స్టోర్ల తనిఖీలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Be the first to react

Latest