డ్వాక్రా మహిళల సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ‘ఈ–నారీ’ అనే పేరుతో డ్వాక్రా సంఘాల్లోనే చురుకుగా పనిచేసే, అర్హతలు కలిగిన మహిళలను ఎంపిక చేసి నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీరి ద్వారా సంఘంలోని మిగతా సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. తక్కువ వడ్డీకే రుణాలు, పొదుపు అలవాట్లకు ప్రోత్సాహం, వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పుడు ఈ–నారీ విధానం ద్వారా మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించడంతో పాటు, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలకు సాంకేతిక అవగాహన అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మన డబ్బులు–మన లెక్కలు’ వంటి మొబైల్ యాప్ల ద్వారా రుణ వాయిదాలు చెల్లించడం, సంఘానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం సులభమవుతోంది. ఈ యాప్లను సమర్థంగా వినియోగించేందుకు ఈ–నారీలు కీలక పాత్ర పోషించనున్నారు.
డ్వాక్రా సంఘాల్లో యాక్టివ్గా ఉండే మహిళలను ఈ–నారీలుగా ఎంపిక చేసి శిక్షణ అందిస్తారు. ఎంపికైన ఈ–నారీలు ఇతర సభ్యులకు యాప్ల వినియోగం, ఆర్థిక లావాదేవీలు, సంఘ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఈ–నారీగా పనిచేసే మహిళలకు ఆర్థిక భరోసా కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ–నారీ ఎంపికకు కొన్ని అర్హతలను నిర్దేశించారు. వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి, డ్వాక్రా సంఘ సభ్యురాలిగా కొనసాగుతూ ఉండాలి, కనీసం 10వ తరగతి చదివి ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. 25కి పైగా డ్వాక్రా సంఘాలు ఉన్న గ్రామాల్లో 6 నుంచి 10 మందిని ఈ–నారీలుగా ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.