Srisailam: శ్రీశైలం అభివృద్ధి పనులపై వివాదం.. సాలు మండపాల నిర్మాణంపై ట్రస్ట్ బోర్డు, దేవదాయ శాఖ మధ్య విభేదాలు!

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రూ.19 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సాలు మండపాల నిర్మాణం విషయంలో దేవదాయ శాఖ అధికారులు, దేవస్థానం ధర్మకర్తల మండలి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవస్థానం అభివృద్ధి పనులు ప్రతిష్ఠంభనలో పడినట్లు తెలుస్తోంది.

Srisailam 2
Srisailam 2

రూ.19 కోట్ల సాలు మండపాల నిర్మాణంపై వివాదం.. సీఎంకు ట్రస్ట్ బోర్డు లేఖ..

రెండుసార్లు టెండర్ తిరస్కరణ.. సాలు మండపాల నిర్మాణంపై ఉత్కంఠ..

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రూ.19 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సాలు మండపాల నిర్మాణం విషయంలో దేవదాయ శాఖ అధికారులు, దేవస్థానం ధర్మకర్తల మండలి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవస్థానం అభివృద్ధి పనులు ప్రతిష్ఠంభనలో పడినట్లు తెలుస్తోంది.

దేవదాయ శాఖ అధికారులు సాలు మండపాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను త్వరగా ఆమోదించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టెండర్‌ను ధర్మకర్తల మండలి ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టెండర్‌ను ఆమోదించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమేష్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్లు సమాచారం.

ఆ లేఖలో, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న సాలు మండపాల నిర్మాణానికి స్పష్టమైన మాస్టర్ ప్లాన్ లేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగా ఆధునిక క్యూ కాంప్లెక్స్ మరియు పిలిగ్రీమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్ (PAC) నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మకర్తల మండలి అభిప్రాయపడుతోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయని ట్రస్ట్ బోర్డు భావిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయాలని ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ఛైర్మన్ రమేష్ నాయుడు కోరినట్లు సమాచారం.

అభివృద్ధి పనులకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ధర్మకర్తల మండలి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా టెండర్లు పిలుస్తున్నారని ఛైర్మన్ రమేష్ నాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలు ట్రస్ట్ బోర్డు ఆమోదంతోనే ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సాలు మండపాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న దేవదాయ శాఖ ప్రయత్నాలు, మరోవైపు భక్తుల దీర్ఘకాల అవసరాలకు అనుగుణంగా క్యూ కాంప్లెక్స్, పిలిగ్రీమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ధర్మకర్తల మండలి అభిప్రాయం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.

Tags

Be the first to react

Latest