వృద్ధ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత సులభంగా, గౌరవంగా అందించాలనే లక్ష్యంతో తిరుపతిలో కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఉచిత దర్శన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఉచిత దర్శన సౌకర్యం 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వృద్ధులకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా తిరుమలలో దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం వృద్ధులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం. ఉదయం 10 గంటలకు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు ప్రత్యేక దర్శన సమయాలు కేటాయించారు. నిర్ణీత సమయాల్లోనే స్వామివారి దర్శనం కల్పించడం వల్ల శారీరకంగా అలసట లేకుండా దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
దర్శనానికి వెళ్లే ముందు వృద్ధులు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఎస్–1 కౌంటర్ వద్ద ఈ పత్రాలు పరిశీలించిన తర్వాత దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వెళ్లే మార్గాన్ని కూడా ప్రత్యేకంగా సులభంగా రూపొందించారు. వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా దేవాలయం కుడిగోడ వెంబడి ముందుకు సాగితే వృద్ధుల కోసం ప్రత్యేక మార్గం కనిపిస్తుంది.
క్యూ లైన్‌లోకి వెళ్లిన తర్వాత సుమారు 30 నిమిషాల్లోనే దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా వృద్ధులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. దర్శనం అనంతరం భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందించడమే కాకుండా, వేడి పాలు కూడా ఇస్తున్నారు. ఇది వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న మరో మంచి చర్యగా భక్తులు అభినందిస్తున్నారు.
ఈ మొత్తం ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తోంది. వృద్ధ భక్తులకు ఎక్కడైనా సహాయం అవసరమైతే వెంటనే స్పందించేలా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, సహాయం కావాలన్నా 87722 77777 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సిబ్బందిని కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, వృద్ధులతో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేశారు.