ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందిస్తున్నట్లు దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దివ్యాంగులు మంత్రిని కలసి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులకు ఏడు వరాలుగా ప్రభుత్వం పలు కీలక సౌకర్యాలు కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అమరావతిలో ప్రత్యేక దివ్యాంగ భవన్, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, క్రీడల్లో ప్రోత్సాహం, ప్రత్యేక ఆర్థిక రాయితీలు, గృహనిర్మాణ పథకాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వైద్య–సామాజిక భద్రత వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
త్వరలోనే దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ.17.50 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 1,750 మంది దివ్యాంగులకు ఈ త్రీ వీలర్లను అందించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 మంది చొప్పున అర్హులను ఎంపిక చేసి వాహనాలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
దివ్యాంగుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మించనున్నారు. ఈ స్టేడియం ద్వారా దివ్యాంగ క్రీడాకారులు శిక్షణ పొందడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఉపాధి అవకాశాల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత నైపుణ్య శిక్షణ, డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ అందించనున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు, రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలు దివ్యాంగుల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.