ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలో పల్లె వెలుగు సర్వీసుల కోసం కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ఈ నిర్ణయ లక్ష్యం.
మంగళవారం ఆర్టీసీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఇకపై పల్లె వెలుగు సర్వీసుల కోసం తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే నడపాలని అధికారులకు ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు.
పర్యావరణహిత ప్రజా రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 8,819 డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సీఎం అంగీకారం తెలిపారు. అలాగే 8 ఏళ్లకు పైగా ఉపయోగంలో ఉన్న బస్సులను తొలగించి, వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
స్త్రీ శక్తి పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, కొత్త బస్సులు అవసరమని సీఎం పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని, రైల్వే తరహాలో కార్గో రవాణాను కూడా అభివృద్ధి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతున్న విషయం తెలిసిందే. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అమలులో ఉంది. తాజాగా పల్లె వెలుగు సర్వీసులకు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల మహిళలతో పాటు గ్రామీణ ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మారనుంది.