ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాజాగా మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ రైల్వే లైన్ కోసం ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో ఉన్న 8 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. ఇందులో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ, ఎసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. పరిటాల గ్రామ పరిధిలో ఉన్న 2.942 ఎకరాల గెస్ట్ హౌస్ స్థలానికి సంబంధించిన మూడు పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ మొత్తం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ చర్యలు కొనసాగిస్తోంది.
ఈ భూసేకరణకు సంబంధించి ఇప్పటికే డిసెంబర్ 21, 2024న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధీకృత అధికారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, ఈ భూములను రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సేకరించే భూములు ఇకపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రాజెక్టుపై రైతులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు సుమారు 56.53 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణ కాకుండా భూసమీకరణ విధానాన్ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు జిల్లాల రైతులు తమ భూములను సమీకరణ పద్ధతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
భూసేకరణకు రైతులు వ్యతిరేకించడంతో కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో పనులకు అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది. పల్నాడు జిల్లాలోని మూడు గ్రామాలు, గుంటూరు జిల్లాలోని ఏడు గ్రామాల రైతులు భూసేకరణకు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.