ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లారీ యజమానులకు భారీ ఊరట కల్పించింది. కేంద్ర ప్రభుత్వం సరకు రవాణా వాహనాలపై పెంచిన ఫిట్‌నెస్ ఫీజులను రాష్ట్రంలో ప్రస్తుతానికి అమలు చేయబోమని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పాత ఫీజులనే వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఈ నెల 11న సరుకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులను భారీగా పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా 20 ఏళ్లు దాటిన లారీలపై ఈ ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో లారీ యజమానులు గరిష్టంగా రూ.33 వేల వరకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది తమపై తీవ్ర ఆర్థిక భారం అవుతుందని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని రహదారి భద్రత సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. లారీ యజమానుల సంఘం ఈ పెంపును వ్యతిరేకిస్తూ, భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక మెమో జారీ చేసింది. ఈ మెమో ప్రకారం, కేంద్రం పెంచిన ఫిట్‌నెస్ ఫీజులను రాష్ట్రంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో అధ్యయనం చేసి, పూర్తి నివేదికను సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ తాజా నిర్ణయంతో ఏపీ లారీ యజమానుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. తమ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రవాణాశాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లారీ యజమానులకు తాత్కాలికంగా అయినా ఆర్థిక భారం తగ్గినట్లయిందని వారు అభిప్రాయపడ్డారు.