ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఏళ్ల తరబడి తలనొప్పిగా మారిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భూ తగాదాలు, పట్టాదారు పాస్‌బుక్ సమస్యలు, రికార్డుల లోపాలు వంటి అంశాలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, దీనిని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు ఇకపై ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసి, ప్రజల అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించే విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ రెవెన్యూ క్లినిక్‌లు ప్రధానంగా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే సందర్భంగా పనిచేస్తాయి. ఆ రోజు ప్రజల నుంచి భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, వాటిని వెంటనే వర్గీకరించి పరిష్కార ప్రక్రియ ప్రారంభిస్తారు. పట్టాదారు పాస్‌బుక్, 1/70 సమస్యలు, ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్), ఆర్ఓఎఫ్ఆర్ (అటవీ హక్కుల రికార్డు), రీసర్వే తదితర మొత్తం 14 రకాల భూ సమస్యలుగా అర్జీలను విభజిస్తారు. ఇందుకోసం కలెక్టరేట్లో 14 ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసి, ప్రతి టేబుల్ వద్ద సంబంధిత విభాగ సిబ్బందిని నియమిస్తారు. అర్జీదారుడు సమస్య ఏ విభాగానికి చెందిందో గుర్తించి, నేరుగా ఆ టేబుల్ వద్దకు పంపేలా ఏర్పాట్లు చేస్తారు.
ప్రతి అర్జీకి తప్పనిసరిగా ఒక ఆన్లైన్ నంబర్ కేటాయిస్తారు. దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్, ఆధార్ వివరాలను నమోదు చేసి, సమస్య పరిష్కారానికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను రాతపూర్వకంగా అందిస్తారు. ఇందులో సమస్య తీవ్రత, పరిష్కారానికి పడే అంచనా సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ కార్యాచరణ పత్రంపై డిప్యూటీ కలెక్టర్ సంతకం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు వీలైనంత వరకు ఒకే రోజులో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, నిర్దిష్ట గడువు నిర్ణయించి ఆలోపే పరిష్కారం చూపాల్సి ఉంటుంది.
అర్జీల పరిశీలన మొదట రెవెన్యూ క్లినిక్ డెస్క్ స్థాయిలో జరుగుతుంది. అనంతరం వాటిని సంబంధిత తహసీల్దార్‌కు పంపి, ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సీనియర్ అధికారుల సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. సమస్య పరిష్కారం పూర్తైన తర్వాత ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా అర్జీదారుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ట్రాక్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌ల అమలు భూ సమస్యల పరిష్కారంలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, సాధారణ ప్రజలు ఇకపై కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.