60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించనున్న RBI.. దేశీయ నిల్వలు 740 టన్నులకు
RBI Master Plan: 2026 సెప్టెంబర్ చివరి నాటికి భారత్ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో 740.13 టన్నులు దేశీయంగా భద్రపరిచారు. మిగిలిన 140.39 టన్నులను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచారు.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. స్వదేశానికి బంగారం
740 టన్నులకు చేరిన దేశీయ బంగారు నిల్వలు
విదేశాల నుంచి భారత్‌కు భారీగా బంగారం
Business: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో భద్రపరిచిన బంగారంలో నుంచి సుమారు 60 టన్నులను తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. దీంతో దేశంలోనే భద్రపరిచిన ఆర్బీఐ బంగారు నిల్వలు 740 టన్నులకు చేరాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారాన్ని స్వదేశంలోనే ఎక్కువగా నిల్వ చేసుకోవడంపై ఆర్బీఐ దృష్టి సారించింది.
ఆర్బీఐ విడుదల చేసిన తాజా అర్ధవార్షిక నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్ చివరి నాటికి భారత్ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో 740.13 టన్నులు దేశీయంగా భద్రపరిచారు. మిగిలిన 140.39 టన్నులను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచారు.
2026 మార్చి చివరి నాటికి భారత్‌లో దేశీయంగా 680.05 టన్నుల బంగారం మాత్రమే ఉండేది. విదేశాల్లో 197.67 టన్నులు నిల్వ ఉండేవి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య మరో 60.08 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించడంతో దేశీయ నిల్వల వాటా 77.23 శాతం నుంచి 84.05 శాతానికి పెరిగింది. అయితే ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం పరిమాణం మాత్రం 880.52 టన్నులుగానే ఉంది. అంటే కొత్తగా 60 టన్నుల బంగారం కొనుగోలు చేయలేదు. విదేశాల్లో ఉన్న నిల్వలను స్వదేశానికి తరలించింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఆర్బీఐ బంగారు నిల్వల విలువ కూడా తగ్గింది. మార్చి చివరి నాటికి 115.40 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం విలువ సెప్టెంబర్ నాటికి 106.08 బిలియన్ డాలర్లకు పడిపోయింది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా 16.70 శాతం నుంచి 14.38 శాతానికి తగ్గింది.
మొత్తంగా చూస్తే విదేశాల్లో బంగారాన్ని నిల్వ ఉంచడం కంటే స్వదేశంలోనే భద్రపరచడానికి ఆర్బీఐ ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎదురైనప్పుడు దేశ బంగారు నిల్వలపై నేరుగా నియంత్రణ ఉండేలా ఈ చర్య ఉపయోగపడుతుంది.
Tags
Be the first to react