గణనీయంగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం
AP Revenue Growth: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయార్జన శాఖల పనితీరుతో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏపీ సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయ వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు.
- ఏపీ సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరి 18.7 శాతం వృద్ధి సాధించింది.
- గతేడాదితో పోలిస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.11,738 కోట్ల ఆదాయం వచ్చింది.
AP Revenue Growth: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయార్జన శాఖల పనితీరుతో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏపీ సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయ వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు.
గత ఏడాదితో పోలిస్తే రూ.11,738 కోట్లు అదనం
అమరావతిలో బుధవారం ఆదాయార్జన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,604 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం అది రూ.74,342 కోట్లకు చేరింది. అంటే ఏడాదిలో రూ.11,738 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.
రాష్ట్ర వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1,27,506 కోట్లుగా ఉండగా.. నవంబర్ 23 నాటికే 58 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 18.8 శాతం, పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైంది.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌లో పెరిగిన ఆదాయం
శాఖల వారీగా చూస్తే వాణిజ్య పన్నుల ద్వారా 18.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో రూ.5,917 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం కూడా 18.1 శాతం పెరిగి రూ.3,694 కోట్ల మేర అదనంగా లభించింది.
ఎక్సైజ్ శాఖ ఆదాయం స్పెషల్ మార్జిన్‌తో కలిపి రూ.20,083 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ శాఖలో 19.6 శాతం వృద్ధి నమోదైంది. అదనంగా రూ.3,287 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.
ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలి
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా, కొత్త ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో ఆదాయ లీకేజీలను అరికట్టాలని, వసూళ్లలో పారదర్శకత పెంచాలని స్పష్టం చేశారు.
ఆదాయ వసూళ్లకు ఏఐ సాంకేతికత
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్ల కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఏప్రిల్ నుంచే ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, క్షేత్రస్థాయి తనిఖీలు, న్యాయపరమైన వ్యవహారాల్లోనూ ఈ సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఆదాయ వృద్ధి కూడా ఇదే స్థాయిలో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Be the first to react