Air Asia: విమాన ఆలస్యం.. రైతుకు రూ.90,750 చెల్లించాలని ఎయిర్ ఏషియాకు ఆదేశం!

Air Asia: విమాన సర్వీసులో ఆలస్యం కారణంగా నష్టపోయిన ఓ రైతుకు పరిహారం చెల్లించాలని కేరళలోని పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది.

Air Asia
Air Asia

రైతుకు న్యాయం చేసిన వినియోగదారుల కమిషన్.. ఎయిర్ ఏషియాపై పరిహారం వేటు..

అరుదైన హైబ్రిడ్ పనస మొక్క కోల్పోయిన రైతుకు భారీ ఊరట..

పాలక్కాడ్: విమాన సర్వీసులో ఆలస్యం కారణంగా నష్టపోయిన ఓ రైతుకు పరిహారం చెల్లించాలని కేరళలోని పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్ను ఆదేశించింది. రైతుకు జరిగిన ఆర్థిక నష్టం, మానసిక ఇబ్బందులకు గాను మొత్తం రూ.90,750 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

పాలక్కాడ్కు చెందిన ఈ రైతు హైబ్రిడ్ పండ్ల రకాల సాగు, పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. అరుదైన హైబ్రిడ్ పనస మొక్కను తీసుకురావడానికి 2025 ఆగస్టులో కొచ్చి నుంచి ఇండోనేషియాకు ప్రయాణించారు. తిరుగు ప్రయాణంలో ఇండోనేషియాలోని మెడాన్-కౌలానాము నుంచి కౌలాలంపూర్కు వెళ్లే ఎయిర్ ఏషియా విమానం కొన్ని గంటలు ఆలస్యమైంది.

దీంతో మూడు గంటలకు పైగా సమయం ఉన్న కనెక్టింగ్ ఫ్లైట్ను కూడా ఆయన మిస్ అయ్యారు. కౌలాలంపూర్ చేరుకున్న తర్వాత ఎయిర్లైన్ అధికారులను సంప్రదించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. తనతో ఉన్న మొక్క సున్నితమైనదని, అవసరమైతే అదనపు ఛార్జీలు చెల్లించేందుకు సిద్ధమని కూడా తెలిపారు.

అయితే, కొచ్చికి వెళ్లే తదుపరి విమానం మూడు రోజుల తర్వాత మాత్రమే ఉందని అధికారులు చెప్పారని రైతు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత తానే ప్రయత్నించి మరుసటి రోజు మరో ఎయిర్ ఏషియా విమానంలో సీటు పొందినట్లు తెలిపారు.

విమాన ఆలస్యం, సరైన సహాయం అందకపోవడంతో తాను తీసుకొచ్చిన అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతిని ఉపయోగపడకుండా పోయిందని రైతు వాపోయారు. దీంతో తన ప్రయాణ లక్ష్యం నెరవేరలేదని, అదనపు ప్రయాణం, వసతి ఖర్చులు కూడా భరించాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ ఫిర్యాదుపై ఎయిర్ ఏషియా తరఫున స్పందన రాకపోవడంతో కేసును కమిషన్ ఏకపక్షంగా విచారించింది. విమాన టికెట్లు, ప్రయాణ వివరాలు వంటి ఆధారాలను పరిశీలించిన కమిషన్.. ప్రయాణికుడికి అవసరమైన సహాయం అందించకపోవడం సేవా లోపమేనని నిర్ధారించింది.

కమిషన్ ఆదేశాల ప్రకారం ఎయిర్ ఏషియా రైతుకు టికెట్ ఛార్జీలుగా రూ.30,750, అదనపు ప్రయాణం మరియు వసతి ఖర్చులకు రూ.25,000, సేవా లోపానికి పరిహారంగా రూ.25,000, న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలి.

ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని, ఆలస్యం జరిగితే పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలకు రూ.500 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. రైతు తరఫున న్యాయశ్రయ అసోసియేట్స్ న్యాయవాదులు జీవన్ జాన్, సిద్ధ్య శశిధరన్, అరవింద్ వాదనలు వినిపించారు.

Tags

Be the first to react

Latest