దిమ్మతిరిగే ఆఫర్.. ఈవీ ప్రియులకు పండుగే పండుగ.. ఆరు టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరల్లో భారీ వ్యత్యాసం!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలును మరింత సులభతరం చేసే దిశగా ఒక కీలక ముందడుగు వేసింది. తన వినూత్నమైన 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) పథకాన్ని ఇప్పుడు అన్ని ఈవీ మోడళ్లకు విస్తరించింది.
- అన్ని ఈవీ మోడళ్లకు 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' పథకం విస్తరణ..
- AUTO: హారియర్ ఈవీ ప్రారంభ ధరపై ఏకంగా రూ.7.30 లక్షల ఆదా..
Tata Motors: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు తన వినూత్న 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) పథకాన్ని ఇప్పుడు అన్ని ఈవీ మోడళ్లకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు కేవలం టియాగో ఈవీ, పంచ్ ఈవీ మోడళ్లకు మాత్రమే పరిమితమైన ఈ లీజింగ్ సదుపాయం, ఇకపై కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ నెక్సాన్ ఈవీతో పాటు రాబోయే కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ మరియు హారియర్ ఈవీ కార్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఈ కీలక నిర్ణయంతో టాటా ఈవీల ప్రారంభ కొనుగోలు ధరలు ఏకంగా రూ. 2.30 లక్షల నుంచి రూ. 7.30 లక్షల వరకు తగ్గనున్నాయి.
ఏమిటీ 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) విధానం?
సాధారణంగా ఏ ఎలక్ట్రిక్ వాహనంలోనైనా మెజారిటీ ఖర్చు బ్యాటరీ రంగానికే పోతుంది. కారు మొత్తం ధరలో దాదాపు 40% నుంచి 50% వరకు కేవలం బ్యాటరీ వ్యయమే ఉంటుంది. దీనివల్లే పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీల ఆరంభ ధర చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే టాటా మోటార్స్ BaaS మోడల్‌ను తీసుకొచ్చింది.
ఈ విధానంలో కారు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు బ్యాటరీకి పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీ (షెల్) మెటీరియల్‌కు మాత్రమే డబ్బులు చెల్లించి వాహనాన్ని షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్లవచ్చు.
బ్యాటరీని కంపెనీ నుంచి నెలవారీ అద్దె లేదా లీజు ప్రాతిపదికన వాడుకోవచ్చు. దీనికోసం వాహనానికి మరియు బ్యాటరీకి వేర్వేరుగా ఫైనాన్స్/లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అయితే, సదరు బ్యాటరీతో సహా కారును ఒకేసారి కొనుగోలు చేయాలనుకునే వారికి పాత సాంప్రదాయ విధానం కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
మోడల వారీగా తగ్గిన కారు ప్రారంభ ధరలు..
BaaS పథకం వర్తింపజేయడం వల్ల కారు కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన ప్రారంభ ఆన్-రోడ్/ఎక్స్-షోరూమ్ పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి:
టియాగో ఈవీ: ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు (నేరుగా రూ. 2.30 లక్షల ఆదా)
పంచ్ ఈవీ: ప్రారంభ ధర రూ. 6.59 లక్షలు (నేరుగా రూ. 3.20 లక్షల ఆదా)
నెక్సాన్ ఈవీ: ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు (నేరుగా రూ. 5.35 లక్షల ఆదా)
కర్వ్ ఈవీ: ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (నేరుగా రూ. 6.20 లక్షల ఆదా)
సియెర్రా ఈవీ: ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (నేరుగా రూ. 6.80 లక్షల ఆదా)
హారియర్ ఈవీ: ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు (నేరుగా రూ. 7.30 లక్షల ఆదా)
బ్యాటరీ వినియోగానికి ఎంత ఖర్చవుతుంది?
కారును తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, బ్యాటరీ వాడకానికి ప్రత్యేకంగా అద్దె ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము బ్యాటరీ కెపాసిటీ, మీరు చెల్లించే డౌన్‌పేమెంట్ మరియు లోన్ టెన్యూర్ ఆధారంగా మారుతుంది.
ఉదాహరణకు రోజుకు సగటున 60 కిలోమీటర్లు ప్రయాణించే వినియోగదారులకు, ఛార్జింగ్ ఖర్చు కాకుండా కిలోమీటరుకు అయ్యే బ్యాటరీ అద్దె అంచనా ఇలా ఉంది:
టియాగో ఈవీ & పంచ్ ఈవీ: కిలోమీటరుకు రూ. 2.6
నెక్సాన్ ఈవీ: కిలోమీటరుకు రూ. 4.4
కర్వ్ ఈవీ: కిలోమీటరుకు రూ. 5.0
సియెర్రా ఈవీ: కిలోమీటరుకు రూ. 5.5
హారియర్ ఈవీ: కిలోమీటరుకు రూ. 5.9
ఈ నెలవారీ/కిలోమీటర్ల రుసుములో కేవలం బ్యాటరీ వాడకం మాత్రమే ఉంటుందని, ఛార్జింగ్ వ్యయం, జనరల్ కార్ సర్వీసింగ్ లేదా మరమ్మతుల ఖర్చులు ఇందులో కలిసి ఉండవని వాహనదారులు గుర్తుంచుకోవాలి. అధిక ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు దూరంగా ఉంటున్న మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవడంలో ఈ BaaS పథకం గేమ్ ఛేంజర్‌గా మారనుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
Be the first to react