మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వచ్చేస్తోంది.. లీటరుకు 30 కి.మీ పైగా మైలేజ్ టార్గెట్ తో..!
Hybrid SUVs: భారత ఆటో మార్కెట్లో లీటరుకు 30 నుంచి 35 కి.మీ మైలేజ్ ఇచ్చే నాలుగు సరికొత్త కాంపాక్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్, కియా సోనెట్ హైబ్రిడ్, హ్యుందాయ్ వెన్యూ హైబ్రిడ్ మరియు రెనాల్ట్ బ్రిడ్జర్ ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ మైలేజ్ అందించే ఈ కార్లు సామాన్య కార్ల ప్రియులకు ఇంధన ఖర్చులను భారీగా తగ్గించనున్నాయి.
కియా సోనెట్ హైబ్రిడ్ రాక ఖరారు.. కాంపాక్ట్ సెగ్మెంట్‌లో పెను ప్రకంపనలు!
హ్యుందాయ్ వెన్యూ హైబ్రిడ్ సిద్ధం.. 30+ మైలేజ్ దిశగా సరికొత్త అడుగులు!
రెనాల్ట్ నుంచి సరికొత్త 'బ్రిడ్జర్'.. టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Auto: భారత ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వాహనదారులు మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటివరకు గ్రాండ్ విటారా, హైరైడర్ వంటి ఖరీదైన పెద్ద ఎస్‌యూవీలకే పరిమితమైన ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ టెక్నాలజీని, ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా 4-మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. లీటరుకు 30 నుంచి 35 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చేలా రూపొందుతున్న నాలుగు సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ (Maruti Suzuki Fronx Hybrid)
ఈ జాబితాలో అత్యంత కీలకమైన మోడల్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్. మారుతి సుజుకి తన కాంపాక్ట్ కార్ల కోసం అంతర్గతంగా అభివృద్ధి చేసినటెక్నాలజీతో ఫ్రాంక్స్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో 1.2 లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ రేంజ్ ఎక్స్‌టెండర్ జనరేటర్‌గా పనిచేస్తూ ఎలక్ట్రిక్ మోటారు మరియు బ్యాటరీ ప్యాక్‌కు పవర్ అందిస్తుంది. భారత్‌లోనే విడిభాగాలను తయారు చేస్తుండటంతో అత్యంత సరసమైన ధరకే లభించే ఈ కారు లీటరుకు ఏకంగా 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ లక్ష్యంతో రానుంది.
కియా సోనెట్ హైబ్రిడ్ (Kia Sonet Hybrid)
భారత మార్కెట్లో దూకుడు ప్రదర్శిస్తున్న కియా మోటార్స్ కూడా తన హైబ్రిడ్ రోడ్‌మ్యాప్‌ను అధికారికంగా ప్రకటించింది. కియా సీఈవో ఇన్వెస్టర్ డే సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘సోనెట్’ (Sonet) లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకురానున్నారు. భవిష్యత్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లో భాగంగా రానున్న ఈ సోనెట్ హైబ్రిడ్ లీటరుకు 30 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చేలా అత్యాధునిక బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో మార్కెట్లోకి రానుంది.
హ్యుందాయ్ వెన్యూ హైబ్రిడ్ (Hyundai Venue Hybrid)
కియాతో పోటీ పడుతూ హ్యుందాయ్ మోటార్స్ సైతం తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘వెన్యూ’ (Venue) లో హైబ్రిడ్ వేరియంట్‌ను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, టర్బో ఇంజిన్లతో మాత్రమే లభిస్తున్న వెన్యూకు తదుపరి జనరేషన్ అప్‌డేట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌ను జోడించనున్నారు. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానించడం ద్వారా నగరాల్లో తిరిగే వారికి లీటరుకు దాదాపు 30 కి.మీ మైలేజ్ అందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నట్లు ఆటో వర్గాలు భావిస్తున్నాయి.
రెనాల్ట్ బ్రిడ్జర్ హైబ్రిడ్ (Renault Bridger Hybrid)
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘బ్రిడ్జర్’. టాటా నెక్సాన్, బ్రెజ్జాలకు గట్టి పోటీగా రానున్న ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెట్రోల్, సీఎన్‌జీతో పాటు మల్టీ-మోడ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించనున్నారు. రగ్గడ్ బాక్సీ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో రూపొందుతున్న ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన హైబ్రిడ్ సెటప్ ద్వారా 30 కి.మీ మైలేజ్ లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఖర్చు ఆదా – సామాన్యుడికి అందుబాటులోకి గ్రీన్ టెక్
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ స్టేషన్ల కొరత, అధిక కొనుగోలు ధర ప్రధాన అడ్డంకిగా మారగా, హైబ్రిడ్ కార్లు వాటికి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఛార్జింగ్ అవసరం లేకుండా, పెట్రోల్ వాడుతూనే ఎలక్ట్రిక్ బ్యాటరీ ద్వారా నడిచే ఈ కార్లు నగర ట్రాఫిక్‌లో భారీగా ఇంధనాన్ని ఆదా చేస్తాయి. రాబోయే రెండేళ్లలో భారత రోడ్లపైకి రానున్న ఈ నాలుగు సరికొత్త కాంపాక్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇంధన ఖర్చుల భారం నుంచి పెద్ద ఊరటనివ్వనున్నాయి.
Tags
Be the first to react