Chandrababu: అంతర్జాతీయ మార్కెట్లకు AP వ్యవసాయ ఉత్పత్తులు.. NRI లు అవకాశం అందిపుచ్చుకోండి! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Chandrababu: రైతు పండించిన పంటకు మంచి ధర రావాలంటే కేవలం సాగు సరిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని పిలుపునిచ్చారు. రైతులను కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Chandra Babu Naidu
Chandra Babu Naidu

పంటలకు విలువ జోడించి ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్తాం: సీఎం చంద్రబాబు..

ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకోకు గ్లోబల్ బ్రాండ్‌ గుర్తింపు రావాలి..

నూజివీడు: రైతు పండించిన పంటకు మంచి ధర రావాలంటే కేవలం సాగు సరిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని పిలుపునిచ్చారు. రైతులను కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఏలూరు జిల్లా ముసునూరు వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి దేశీయ నాన్-GMO హైబ్రీడ్ పాప్‌కార్న్ మెయిజ్ విత్తనాలను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం గార్మె పాప్‌కార్నికా ఏర్పాటు చేసిన పాప్‌కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు.

17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో సాగు
గార్మె పాప్‌కార్నికా సంస్థ దేశీయంగానే జన్యుమార్పిడి లేని పాప్‌కార్న్ విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో నాన్-GMO హైబ్రీడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారని చెప్పారు.

నూజివీడు ప్రాంతంలో పండే పాప్‌కార్న్ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతోందన్నారు. ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు.

దేశవ్యాప్తంగా పాప్‌కార్న్ ఉత్పత్తిలో గార్మె సంస్థకు సుమారు 70 శాతం వాటా ఉందని సీఎం పేర్కొన్నారు. యాంత్రీకరణ, విత్తనాల సరఫరా, సాగులో సాంకేతికత, రైతుల నుంచి పంట కొనుగోలు వరకు మొత్తం వ్యవస్థను సంస్థ సమన్వయంతో నిర్వహిస్తోందని వివరించారు.

ఇక విదేశాల నుంచి దిగుమతి కాదు.. మన పాప్‌కార్నే ప్రపంచానికి
ఇప్పటివరకు భారత్‌లో వినియోగించిన పాప్‌కార్న్‌లో కొంత భాగం బ్రెజిల్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇకపై ఆ సంపద మన దేశంలోనే ఉండేలా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ను పెంచాలని అన్నారు. ఆంధ్రా పాప్‌కార్న్‌ను ఆసియా మార్కెట్‌కే పరిమితం చేయకుండా ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ కు ఏపీ ఉత్పత్తులు చేర్చేందుకు ఎన్నారైల పాత్ర కూడా కీలకం అంటూ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

అలాగే అరకు కాఫీ, కోస్తా కోకో, కొండవీటి కొయ్య బొమ్మలు వంటి స్థానిక ఉత్పత్తులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని చెప్పారు. ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ అందుబాటులో ఉండేలా రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం పంటల్లో కేవలం 10 శాతానికే ప్రాసెసింగ్ 
రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నామని సీఎం తెలిపారు. ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచితే పంటలకు మరింత విలువ వచ్చి సంపద సృష్టించే అవకాశం ఉంటుందన్నారు.

ఈ రంగంలో యువత పెద్ద ఎత్తున అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది తన ఆకాంక్షగా చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు రావాలని అన్నారు. నూజివీడు ప్రాంతంలో పామాయిల్, కోకో, ఆక్వా వంటి వాణిజ్య రంగాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల్లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతోందన్నారు.

రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దుతాం 
వచ్చే 20 నుంచి 30 ఏళ్లలో ఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి అనే దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు అన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా మార్చేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రూ.1 లక్ష కోట్ల వ్యయంతో రాయలసీమను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ఎల్‌నినో ప్రభావంలోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీరు
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడామని సీఎం తెలిపారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభించి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. ముఖ్యంగా పప్పుధాన్యాల వంటి పంటలను సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు అందించేలా, రాష్ట్రంలో నీటి భద్రత కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం 
దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరిగితే నీటి వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. గోదావరి-కృష్ణా, తుంగభద్ర, పెన్నా-కావేరీ నదులను అనుసంధానం చేయడం ద్వారా నాలుగు రాష్ట్రాల నీటి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. కష్టకాలంలో ఆయకట్టు స్థిరీకరణతో పాటు తాగునీటిని కూడా అందించే అవకాశం ఉంటుందన్నారు.

అలాగే గంగా, మహానది, గోదావరి నదులను అనుసంధానం చేస్తే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధికి అడ్డంకులు ఉండవని, అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా రైతు ఉత్పత్తికి ప్రాసెసింగ్, బ్రాండింగ్ జోడించి ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా సీఎం ప్రసంగం స్పష్టం చేసింది.

Tags

Be the first to react

Latest