Veligonda Project: వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అండ.. తక్షణ సాయంగా రూ.4.07 కోట్లు!
Velugonda Project: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో.. నిర్వాసిత కుటుంబాలు తమ పునరావాస కాలనీలకు స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు అవసరమైన తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం మూడు విభాగాలకు కలిపి రూ.4.068 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ నిర్వాసితులకు ప్రభుత్వం భారీ సాయం..
వెలిగొండ నిర్వాసితులకు రూ.4.068 కోట్లు మంజూరు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో చర్యలు..
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో.. నిర్వాసిత కుటుంబాలు తమ పునరావాస కాలనీలకు స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు అవసరమైన తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం మూడు విభాగాలకు కలిపి రూ.4.068 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. పునరావాస ప్రాంతాల్లో నిర్వాసిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసరాలు, పశువుల దాణా, కొత్త ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో మహిళలకు అవసరమైన ప్రత్యేక సామగ్రి అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
పశువుల దాణాకు రూ.65.8 లక్షలు
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 10 గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాల పశువులకు ప్రభుత్వం దాణా అందించనుంది. మొత్తం 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా అందించేందుకు రూ.65.8 లక్షలు కేటాయించింది.
ఈ కార్యక్రమానికి సుమారు 295.98 మెట్రిక్ టన్నుల దాణా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. పునరావాస కాలనీలకు తరలివెళ్లే సమయంలో పశువుల విషయంలో కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
10 వేల మందికి నిత్యావసరాల కిట్లు
నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం మరో రూ.2.81 కోట్లు కేటాయించింది. మొత్తం 10,000 మందికి నిత్యావసర సరుకుల కిట్లు అందించనున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.2,818గా నిర్ణయించారు. ఈ కిట్‌లో కుటుంబాలకు ఉపయోగపడే ప్రాథమిక సరుకులను చేర్చారు. 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ వంట నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఈ కిట్ లో ఉండనున్నాయి. పునరావాస కాలనీలకు చేరుకున్న తర్వాత తొలి రోజుల్లో కుటుంబాలకు నిత్యావసరాల కొరత లేకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయి.
మహిళా నిర్వాసితులకు ప్రత్యేక కిట్లు
కొత్త ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో మహిళా నిర్వాసితులకు ప్రత్యేకంగా మరో రకమైన కిట్లను ప్రభుత్వం అందించనుంది. మొత్తం 6,000 కిట్లు పంపిణీ చేయనున్నారు.
ఒక్కో కిట్ విలువ రూ.1,000. వీటిలో మహిళలకు ఉపయోగపడే చీర, గాజులు, పసుపు, కుంకుమ ఉంటాయి. ఈ ప్రత్యేక కిట్ల కోసం ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించింది.
పునరావాసం కేవలం ఇళ్ల నిర్మాణంతో ముగియదని, కుటుంబాలు కొత్త వాతావరణంలో స్థిరపడే వరకు అవసరమైన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మూడు విభాగాలకు కలిపి రూ.4.068 కోట్లు
పశువుల దాణా, నిత్యావసర సరుకుల కిట్లు, మహిళా నిర్వాసితుల ప్రత్యేక కిట్ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.4.068 కోట్లు మంజూరు చేసింది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు స్వచ్ఛందంగా తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఇప్పటికే రూ.768 కోట్ల పరిహారం
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.768 కోట్ల పరిహారం అందించింది. తాజాగా తక్షణ సాయం కోసం మరో రూ.4.068 కోట్లను మంజూరు చేయడం ద్వారా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
సీఎం ఆదేశాలతో వేగంగా చర్యలు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాసితుల తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.
ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు కొత్త పునరావాస కాలనీల్లో సౌకర్యవంతంగా జీవనం ప్రారంభించేలా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ముఖ్యంగా పశువుల దాణా, నిత్యావసరాలు, మహిళలకు ప్రత్యేక కిట్ల వంటి అవసరాలను గుర్తించి సాయం అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ చర్యలు నిర్వాసితుల పట్ల సీఎం చంద్రబాబు చూపుతున్న ఉదారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో.. నిర్వాసిత కుటుంబాల పునరావాస ప్రక్రియను కూడా సజావుగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
Tags
Be the first to react