TTD Updates: శ్రీవారి అన్నప్రసాదంలో 15 రకాల మెనూ... అదనపు వంటశాలల ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం!

TTD Updates: అధిక మాసం కారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 10 లక్షల లడ్డూల బఫర్ స్టాక్, 15 రకాల అన్నప్రసాద మెనూ, వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు, గరుడసేవ రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల నిషేధం వంటి కీలక నిర్ణయాలు అమలు చేయనున్నారు.

శ్రీవారి అన్నప్రసాదంలో 15 రకాల మెనూ
శ్రీవారి అన్నప్రసాదంలో 15 రకాల మెనూ
  • గరుడ వాహనం రోజున భారీ ఏర్పాట్లు: భక్తుల రద్దీ నియంత్రణకు పక్కా ప్రణాళిక

  • తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: సామాన్య భక్తులకే ప్రాధాన్యత

  • గరుడసేవ వేళ ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలపై నిషేధం: ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

  • 25 రాష్ట్రాలు, విదేశాల నుంచి 27 కళా బృందాలు: తిరుమాడ వీధుల్లో సాంస్కృతిక శోభ

Andhraprdaesh: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 15వ తేదీన సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానుండగా, అక్టోబర్‌లో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ భారీ ధార్మిక ఉత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ ముద్దాడ రవిచంద్ర అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు ఒకే బృందంగా సమన్వయంతో పనిచేయాలని ఈవో స్పష్టం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిరంతరం 10 లక్షల శ్రీవారి లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచాలని ఆదేశించారు. అలాగే దర్శన క్యూలైన్లు, తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు నిరంతరాయంగా అందించాలని సూచించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలలను ఏర్పాటు చేయడంతో పాటు 15 రకాల మెనూ వెరైటీలతో అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ రోజున భక్తుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గరుడసేవను పురస్కరించుకుని భక్తుల రద్దీ మరియు భద్రతను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. అలాగే తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణించే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను నిరంతరం నడిపేలా రవాణా ప్రణాళికను సిద్ధం చేశారు.

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు మరియు దాతలకు ఇచ్చే ప్రత్యేక ప్రివిలేజ్ దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు.

ఈ బ్రహ్మోత్సవాలలో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి, అలాగే 2 విదేశీ బృందాలతో కలిపి మొత్తం 27 సాంస్కృతిక బృందాలు తిరుమాడ వీధుల్లో విశేష కళా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. తిరుమల క్షేత్రమంతా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, ఫల పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. విజిలెన్స్, పోలీసు యంత్రాంగం మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడంతో పాటు, శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని టీటీడీ పేర్కొంది.

Tags

Be the first to react

Latest