Chandrababu: కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్.. ఏపీ, కర్ణాటక, తమిళనాడులను కలపాలని చంద్రబాబు ప్రతిపాదన!

Chandrababu: రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయంతోనే దేశ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్‌ను 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉందని తెలిపారు.

31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

దక్షిణాది రాష్ట్రాల సమష్టి ప్రగతితో 2047 నాటికి రూ.10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ: సీఎం చంద్రబాబు..

గోదావరి–కావేరి అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా వరద జలాల వినియోగం: సీఎం చంద్రబాబు..

మహాబలిపురం: రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయంతోనే దేశ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్‌ను 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉందని తెలిపారు.

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై జరిగిన ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, నీటి వనరులు, మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సీఎం పలు ప్రతిపాదనలు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కూడా పరస్పర చర్చలు, సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

దక్షిణాది ఐదు రాష్ట్రాలు ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో 31 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి భారత్‌ను 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్లు, తమిళనాడు 2.6 ట్రిలియన్ డాలర్లు, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలుగా ఎదగాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నాయని వివరించారు. సమష్టిగా దక్షిణాది రాష్ట్రాలు 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగగలవని సీఎం పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను కలిపే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానించాలని కోరారు.

యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థల సహకారంతో ఉమ్మడి నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం అండగా నిలిచేలా ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.

దక్షిణాది పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానించాలని సీఎం సూచించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్‌ధామ్ ప్రాంతాలతో కలుపుతూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థయాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలాంటి అనుసంధానంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను సీఎం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని తెలిపారు.

ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో ఏపీకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66 కింద ఉన్న అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.

సెక్షన్ 56కు సంబంధించిన సమస్యలు, వనరుల లోటు, ఆర్థిక భారానికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటవడం సంతోషకరమన్నారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నీటి వనరులు, పచ్చదనం, జీవన ప్రమాణాలు, కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నూతన రాజధాని నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

విభజన చట్టంలోని షెడ్యూల్–13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, అమరావతికి రైలు అనుసంధానం వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే దుగరాజపట్నం పోర్టు, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖపట్నం–విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్ స్టీల్‌కు రైలు అనుసంధానానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు అన్నారు. ఏపీలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా సహా సుమారు 40 నదులు 28 జిల్లాలకు సాగునీరు అందిస్తున్నాయని తెలిపారు.

గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరి బేసిన్‌కు తరలించే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు.

అదే సమయంలో గంగా–కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గంగా నది మిగులు జలాలను దక్షిణాది ప్రాంతాలకు తరలిస్తే తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

నదీ పరివాహక ప్రాంతాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. డీపీఆర్‌లు, అవసరమైన అనుమతులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

సదరన్ జోనల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో వేగంగా అమలయ్యేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి కౌన్సిల్ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఆకాంక్షించారు.

సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం వి.డి. సతీషన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్, అండమాన్–నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె. జోషి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగా కాకుండా ఒకే అభివృద్ధి శక్తిగా ముందుకు సాగితే 2047 నాటికి దేశ ప్రగతికి మరింత పెద్ద చోదకశక్తిగా నిలుస్తాయన్నది ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనల సారాంశంగా నిలిచింది.

Tags

Be the first to react

Latest