పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు! ఇద్దరు అరెస్ట్!
అమరావతి: పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరుతో చేపట్టిన విస్తృత సోదాల్లో ఈ అరెస్టులు జరిగాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
- 'ఆపరేషన్ ఫైర్ వాల్' పేరుతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించింది.
- పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అమరావతి: పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరుతో చేపట్టిన విస్తృత సోదాల్లో ఈ అరెస్టులు జరిగాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
దర్యాప్తులో భాగంగా డబ్బు కోసం పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న నేవీ ఉద్యోగి అన్నం సాయి వరప్రసాద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విశాఖపట్నంలోని నేవల్ బేస్‌కు చెందిన ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు.
వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేత
కోయంబత్తూరులో ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అతడిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులకు సమాచారం చేరవేసేందుకు వాట్సాప్‌ను యాక్టివేట్ చేయడానికి అవసరమైన ఓటీపీని షేర్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సున్నితమైన సమాచారాన్ని కూడా వారికి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ప్రదీప్ ముఖర్జీకి కోర్టు ఈ నెల 14 వరకు న్యాయ రిమాండ్ విధించింది.
ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 18 మంది అనుమానితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విచారించారు. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అనుమానితుల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని పరిశీలిస్తున్నారు.
‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో భాగంగా ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారం చేరవేతకు సంబంధించి మరింత మందికి ప్రమేయం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Be the first to react