Mangalagiri: మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతు బజార్.. రూ.18 కోట్లతో నిర్మాణానికి నారా లోకేష్ శంకుస్థాపన!
Mangalagiri: మంగళగిరి నియోజకవర్గంలో రైతులు, వినియోగదారులకు మరింత మెరుగైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ నిర్మించనున్నారు. ఈ రిటైల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు.
5.90 ఎకరాల్లో మోడల్ రైతు బజార్.. మంగళగిరి రైతులకు భారీ ఊరట..
మంగళగిరిలో ఆధునిక రిటైల్, హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్.. పూర్తి వివరాలివే..
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో రైతులు, వినియోగదారులకు మరింత మెరుగైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ నిర్మించనున్నారు. ఈ రిటైల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే రైతులు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేలా ఈ మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో నిర్మాణం
మోడల్ రైతు బజార్‌ను 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో నిర్మించనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్‌ఆర్ నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మార్కెట్‌ను పరిశుభ్రంగా, పర్యావరణహితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. మొత్తం 71,925 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉండనుంది.
రిటైల్ మార్కెట్‌లో 216 స్టాళ్లు
రిటైల్ విభాగంలో కూరగాయల విక్రయాలకు 102 స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. పండ్లు, పూల విక్రయాలకు మరో 54 ప్రత్యేక స్టాళ్లు ఉంటాయి. ఇతర వస్తువుల విక్రయాలకు 60 షాపులు నిర్మించనున్నారు. దీంతో రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను ఒకే ప్రాంతంలో విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. వినియోగదారులకు కూడా వివిధ రకాల ఉత్పత్తులు ఒకే చోట లభించే సౌకర్యం ఏర్పడుతుంది.
హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రత్యేక సదుపాయాలు
హోల్‌సేల్ మార్కెట్‌లో సరుకులను సులభంగా దింపేందుకు 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కూరగాయల విక్రయాల కోసం 23 షాపులు నిర్మిస్తారు. మార్కెట్‌లో కూరగాయల నిల్వ, శుభ్రపరిచే ప్రక్రియలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 61.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాలు ఏర్పాటు చేయనున్నారు.
క్యాంటీన్, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలు
మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ప్రాజెక్టులో భాగంగా కల్పిస్తున్నారు. 144.6 చదరపు మీటర్లలో అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ ఏరియాలు, 190 చదరపు మీటర్లలో క్యాంటీన్, ప్రజల కోసం 130 చదరపు మీటర్లలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకుల రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. దీంతో మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
పర్యావరణహిత సదుపాయాలకు ప్రాధాన్యం
మోడల్ రైతు బజార్‌లో మౌలిక వసతులతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వాటర్ సంప్, ఓవర్‌హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చెత్త సేకరణ వ్యవస్థ, ఆర్గానిక్ కన్వర్టర్, టెర్రస్‌పై సోలార్ ఎనర్జీ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
రైతులు, వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వినియోగదారులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మోడల్ రైతు బజార్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మంగళగిరిలో ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే స్థానిక రైతులకు తమ ఉత్పత్తుల విక్రయానికి మరింత అనుకూలమైన వేదిక లభించడంతో పాటు ప్రజలకు ఒకేచోట రిటైల్, హోల్‌సేల్ మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
Be the first to react