ఏపీలో ప్రభుత్వ భోదనాసుపత్రుల్లో రూ. 1,011 కోట్లతో సూపర్ స్పెషాలిటీ సేవలు

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ. 1,011 కోట్ల పెట్టుబడితో రోబోటిక్ సర్జరీలు, 5 సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రాలు, 5 ఐవీఎఫ్ కేంద్రాలు, 11 ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి యూనిట్లు, 3 చోట్ల బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలు కల్పించే ప్రతిపాదనలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. ఇవి కార్యరూపం దాల్చితే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.

ఏపీ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల ప్రతిపాదన
ఏపీ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల ప్రతిపాదన
  • విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, అనంతపురం, శ్రీకాకుళం నగరాల్లో ఒక్కొక్కటి రూ. 100 కోట్లతో సమగ్ర క్యాన్సర్ కేంద్రాలు!

  • గుంటూరు, తిరుపతి, కాకినాడ, విజయనగరం, అనంతపురం ఆసుపత్రుల్లో రూ. 17.5 కోట్లతో 5 IVF కేంద్రాల ఏర్పాటుకు యోచన!

  • కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ బోధనాసుపత్రులు!.. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష వివరాలివే!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో (Teaching Hospitals) ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) కేంద్రాలు, అవయవ మార్పిడి యూనిట్లు, సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రాలు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ మరియు రోబోటిక్ సర్జరీ సదుపాయాలను ప్రారంభించేందుకు మొత్తం రూ. 1,011 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. మంగళగిరిలోని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనలను సమీక్షించారు.

విజయవాడ, విశాఖ, కర్నూలు ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ కేంద్రాలు

ప్రతిపాదనల్లో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో (GGH) రూ. 45 కోట్ల ఖర్చుతో రోబోటిక్ సర్జరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రోబోటిక్ సర్జరీలను రాష్ట్రంలో దశలవారీగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తుండగా—విజయవాడతో పాటు విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH), కర్నూలులోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోనూ వీటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఐదు నగరాల్లో IVF కేంద్రాలు & మూడు చోట్ల బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్లు

సంతానలేమి సమస్యలతో బాధపడే పేద, మధ్యతరగతి దంపతులకు ఊరటనిచ్చేలా గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఐదు IVF కేంద్రాలను రూ. 17.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు బోధనాసుపత్రుల్లో రూ. 48 కోట్ల ఖర్చుతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (Bone Marrow Transplant) సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు.

ఐదు సమగ్ర క్యాన్సర్ సెంటర్లు, అవయవ మార్పిడి యూనిట్లు & ప్రత్యేక కేంద్రాలు

క్యాన్సర్ బాధితులకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు అనంతపురం, మచిలీపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఒంగోలు నగరాల్లో ఐదు సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ఒక్కొక్కటి రూ. 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని 11 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ. 163.52 కోట్ల పెట్టుబడితో అవయవ మార్పిడి కేంద్రాలు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఇవి పట్టాలెక్కితే, జిల్లా ఆసుపత్రుల్లోనే పేదలకు ఉచితంగా లేదా అతి తక్కువ ఫీజులతో అత్యున్నత వైద్యం అందనుంది.

Tags

Be the first to react

Latest