డిజిటల్ వ్యవసాయంలో ఏపీ దిక్సూచి.. 52.08 లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడీలు!
AP Digital Agriculture: రైతులకు సాంకేతికతను మరింత చేరువ చేసి సాగు ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు డిజిటల్ వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
ఏపీ డిజిటల్ వ్యవసాయంలో కీలక ముందడుగు.. అగ్రీస్టాక్‌లో 86.8 శాతం లక్ష్యం పూర్తి..
ఎరువుల వినియోగంలో ఏపీ కొత్త విధానం.. APAIMS 2.0తో 22 శాతం ఆదా..
హైదరాబాద్: రైతులకు సాంకేతికతను మరింత చేరువ చేసి సాగు ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు డిజిటల్ వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సౌత్ స్టేట్స్ వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో అమలు చేస్తున్న డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు, ఎరువుల పంపిణీ సంస్కరణలు, పప్పుధాన్యాల సాగు, పంటల బీమా, మార్కెటింగ్, ఎల్‌నినో ఉపశమన చర్యలను వివరించారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అగ్రీస్టాక్‌లో 86.8 శాతం పురోగతి
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా అగ్రీస్టాక్ అమలులో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది PM-KISAN లబ్ధిదారులు ఉండగా, వారిలో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు చెప్పారు. దీంతో 86.8 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు.
ఖరీఫ్–2026లో డిజిటల్ పంటల సర్వే ద్వారా సుమారు 68 లక్షల మంది రైతులకు చెందిన 97 లక్షల ఎకరాల పంట విస్తీర్ణాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. ఈ డేటాను పంటల విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఎరువుల పంపిణీ, కనీస మద్దతు ధర (MSP) కొనుగోళ్లు, ఉత్పత్తి అంచనాలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) వంటి సేవలతో అగ్రీస్టాక్‌ను అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.
APAIMS 2.0తో ఎరువుల వినియోగంలో మార్పు
ఎరువుల పంపిణీని మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా మార్చేందుకు APAIMS 2.0ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతు వివరాలు, కమతం, సాగు విస్తీర్ణం, పండిస్తున్న పంట ఆధారంగా యూరియా, DAPను శాస్త్రీయ సిఫార్సుల మేరకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు సుమారు 24.69 లక్షల మంది రైతులు డిజిటల్ విధానంలో ఎరువులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. యూరియా విక్రయాలు 31 శాతం, DAP విక్రయాలు 32 శాతం తగ్గాయని చెప్పారు. యూరియా వినియోగం 6.67 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి సుమారు 4.60 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గినట్లు వివరించారు.
ఎల్‌నినో కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో ఎరువుల వినియోగం 9 శాతం తగ్గిందని, APAIMS 2.0 ద్వారా అక్రమ వినియోగాన్ని అరికట్టడంతో మరో 22 శాతం ఎరువులను ఆదా చేయగలిగామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్‌గా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ ఎరువుల యాప్‌ను రబీ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
అగ్రీస్టాక్‌కు కేంద్ర సహకారం కోరిన మంత్రి
సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కొనసాగించాలని అచ్చెన్నాయుడు కోరారు. భూ రికార్డుల అనుసంధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, జియో-రిఫరెన్స్ చేసిన గ్రామ పటాల ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అగ్రీస్టాక్ ఆధారిత కొనుగోళ్లు, పంటల బీమా వంటి సేవలకు అవసరమైన డేటాను వివిధ శాఖల మధ్య సులభంగా అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఎల్‌నినోలోనూ పప్పుధాన్యాల సాగులో 99 శాతం లక్ష్యం
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పప్పుధాన్యాల సాగులో రాష్ట్రం దాదాపు 99 శాతం లక్ష్యాన్ని సాధించిందని మంత్రి తెలిపారు. సాధారణంగా పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం సుమారు 3.4 లక్షల హెక్టార్లు ఉంటుందని చెప్పారు. కంది, మినుము, పెసర వంటి పంటల్లో కొన్ని లక్ష్యాలకు మించి సాగు నమోదైనట్లు వివరించారు.
పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్‌లో భాగంగా కంది, మినుములకు 100 శాతం కొనుగోలుకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. తక్కువ కాలంలో చేతికొచ్చే, కరువును తట్టుకునే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాస పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పంటలకు ప్రభుత్వపరంగా బైబ్యాక్ భరోసా కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
రైతుకు గిట్టుబాటు ధర.. వినియోగదారుడికి అందుబాటు ధర
రైతులకు పంటలకు తగిన ధర లభించేలా, వినియోగదారులకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవనం, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లను క్రియాశీలం చేసినట్లు చెప్పారు.
సాధారణ రైతు బజార్లతో పాటు మొబైల్, డిజిటల్ రైతు బజార్లను కూడా అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఎల్‌నినో ఉపశమనానికి రూ.200 కోట్లు
ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా కంటింజెన్సీ విత్తనాలను 80 శాతం రాయితీపై అందించేందుకు రూ.200 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ కింద 32 రకాల విత్తనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
దీంతో భూమిపై పచ్చదనం పెరగడంతో పాటు పశుగ్రాస కొరతను తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నామని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అధిక నీటి అవసరం లేని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఆగస్టు 7 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ, సాగునీటి, రెవెన్యూ, అనుబంధ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఎల్‌నినో ఉపశమన కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు.
“ప్రతి రైతు.. ప్రతి పొలం.. ప్రతి పంటను పరిశీలించి రైతుకు అవసరమైన సాంకేతిక సలహాలు అందిస్తున్నాం. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలను కాపాడటమే మా మొదటి ప్రాధాన్యం” అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
44 లక్షల పంటల బీమా దరఖాస్తులు
పంటల బీమా నమోదును ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టడంతో రైతుల నుంచి మంచి స్పందన లభించిందని మంత్రి తెలిపారు. మొత్తం 44 లక్షల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. ఇందులో 18.83 లక్షల మంది రుణ రైతులు కాగా, సుమారు 26 లక్షల మంది రుణేతర రైతులు ఉన్నారని వివరించారు.
గత ఏడాది సుమారు 2 లక్షలుగా ఉన్న రుణేతర రైతుల బీమా నమోదు ఈ ఏడాది 26 లక్షలకు పెరిగిందని తెలిపారు. సుమారు 17 లక్షల హెక్టార్ల పంటలకు దాదాపు రూ.16 వేల కోట్ల బీమా రక్షణ కల్పించినట్లు చెప్పారు. మొత్తం బీమా ప్రీమియం సుమారు రూ.630 కోట్లు కాగా, అందులో రైతుల వాటా దాదాపు రూ.270 కోట్లుగా ఉందని మంత్రి వివరించారు.
బీమా క్లెయిమ్‌ల పరిష్కారంపై కేంద్రానికి విజ్ఞప్తి
వర్షాధార వ్యవసాయ కుటుంబాలకు పంటల బీమా కీలకమైన ఆర్థిక భరోసా అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.
PMFBY, RWBCIS పథకాల కింద కేంద్ర ప్రభుత్వ వాటాను సకాలంలో విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతును ఒంటరిగా వదిలేది లేదు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాంకేతికతను రైతుకు చేరువ చేయడం, సాగు వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకతను పెంచడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
ప్రకృతి ఎన్ని సవాళ్లు విసిరినా రైతును ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి రైతును మరింత బలోపేతం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Tags
Be the first to react