తెలుగు నాటకరంగానికి కొత్త ఊపు.. నంది నాటకోత్సవాలకు రంగం సిద్ధం!

AP Nandi Natakotsavams 2026: తెలుగు నాటకరంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను పునఃప్రారంభించనుంది. కళలకు కాణాచిగా పేరున్న గుంటూరు జిల్లా తెనాలి వేదికగా వచ్చే జనవరిలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నాటకరంగ కళాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజాలకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం అందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

AP Nandi Natakotsavams 2026
AP Nandi Natakotsavams 2026

తెనాలిలో జనవరిలో నంది నాటకోత్సవాలు.. కందుకూరి అవార్డుల సంఖ్య 5కు పెంపు..

నాటక కళాకారులకు గుడ్‌న్యూస్.. 100 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు..

అమరావతి: తెలుగు నాటకరంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను పునఃప్రారంభించనుంది. కళలకు కాణాచిగా పేరున్న గుంటూరు జిల్లా తెనాలి వేదికగా వచ్చే జనవరిలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నాటకరంగ కళాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజాలకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం అందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (FDC) ఎండీ విశ్వనాథన్‌తో కలిసి మంత్రి దుర్గేష్ ఈ వివరాలను వెల్లడించారు.

రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్

నంది నాటకోత్సవాల్లో పాల్గొనే నాటకాల ఎంట్రీల కోసం మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్‌లో సెలక్షన్ కమిటీని నియమించి, డిసెంబర్‌లో ప్రాథమికంగా ఎంపికైన నాటకాల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

జనవరి 10న కందుకూరి అవార్డుల ప్రదానంతో నంది నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వారం రోజుల పాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నంది నాటకోత్సవాల పురస్కార ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల తెలుగు నాటక సమాజాలకు కూడా అవకాశం

నంది నాటకోత్సవాల్లో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు నాటకాల ప్రదర్శనల వీడియోలను పరిశీలించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తరహాలో వీడియోల ఆధారంగా నాటకాలను పరిశీలించి ఎంపిక చేయనున్నట్లు వివరించారు.

కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలు 5కు పెంపు

నాటకరంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అందించే కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాల సంఖ్యను ప్రభుత్వం మూడు నుంచి ఐదుకు పెంచింది. ఒక్కో పురస్కార గ్రహీతకు రూ.1 లక్ష చొప్పున నగదు పారితోషికం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావు తదితర నాటకరంగ దిగ్గజాల పేర్లతో ఈ పురస్కారాలను అందించనున్నట్లు చెప్పారు.

100 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు

కొత్తగా ఏర్పాటైన 28 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి, ప్రత్యేక సేవలు అందించిన మరో 16 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. పద్యనాటకం, సాంఘిక నాటకం, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజం తదితర విభాగాల్లో మొత్తం 100 మంది కళాకారులు, సంస్థలకు ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే గత ఏడాది తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 16న 100 మందికి ఒక విడతగా కందుకూరి పురస్కారాలను అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.

నాటక పరిషత్తులకు విస్తృతంగా ఆర్థిక ప్రోత్సాహం

నాటక పరిషత్తులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయ విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఒక్కో నాటక పరిషత్‌కు రూ.5 లక్షలు ఇచ్చే విధానానికి బదులుగా, ఎక్కువ మంది కళాకారులకు ప్రయోజనం కలిగేలా ఒక్కో పరిషత్‌కు రూ.1 లక్ష చొప్పున విస్తృతంగా కేటాయిస్తున్నట్లు చెప్పారు.

సినిమా, టీవీ రంగాలకు సింగిల్ విండో

చిత్ర పరిశ్రమ, నాటకరంగానికి అవసరమైన వివిధ అనుమతులను సులభతరం చేసేందుకు FDC ద్వారా సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియ మరింత సులభంగా, సమన్వయంతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సినిమా, టీవీ నంది అవార్డులపై కూడా ప్రకటన

సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన నంది అవార్డులపై ఈ వారంలోనే ప్రకటన విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. జనవరి నాటికి ఈ అవార్డుల ప్రదానోత్సవాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పద్యనాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటిక, కాలేజీ, యూనివర్సిటీ నాటిక, రంగస్థలంపై బెస్ట్ బుక్ తదితర విభాగాల్లో నంది అవార్డులను అందించనున్నట్లు చెప్పారు.

కళాకారులకు గుర్తింపు ఇవ్వడమే లక్ష్యం

నంది నాటకోత్సవాలు కేవలం నాటకాల ప్రదర్శనలకు పరిమితం కాకుండా తెలుగు నాటకరంగ సంస్కృతిని, కళాకారుల ప్రతిభను గౌరవించే వేదికగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. నాటక సమాజాలు కళను బతికిస్తుండగా, కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కళాకారులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించేలా FDC ద్వారా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, నాటక సమాజాలను ప్రోత్సహించడం ద్వారా రంగానికి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

Tags

Be the first to react

Latest