చంద్రబాబా మజాకా! ఒక్క నెలలోనే రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు!

AP Development: ఆంధ్రప్రదేశ్‌లో గత నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో సుమారు రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఖరారయ్యాయి. వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం, పోలవరం ఎడమ కాలువ ప్రారంభం, రూ. 23 వేల కోట్లతో గ్రామీణ-పట్టణ రోడ్లు, రూ. లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, బుర్రిపాలెంలో దేశంలోనే తొలి 3డీ ఇళ్ల పైలట్ ప్రాజెక్ట్, అమరావతి 190 కి.మీ ఓఆర్‌ఆర్ టెండర్లు మరియు రామాయపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వంటి మెగా ప్రాజెక్టులు పట్టాలెక్కాయి.

చంద్రబాబు స్పీడు.. కేంద్రం తోడు
చంద్రబాబు స్పీడు.. కేంద్రం తోడు
  • మూడు దశాబ్దాల కల సాకారం.. వెలుగొండ ప్రారంభంతో మెట్ట ప్రాంత రైతులకు వరం!
  •  పోలవరం ఎడమ కాలువతో ఉత్తరాంధ్రకు పరుగులు తీసిన గోదావరి జలాలు.. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు!
  •  పట్ణాభివృద్ధికి రూ.12 వేల కోట్లు.. ‘పల్లె పండుగ’తో రూ.11 వేల కోట్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రికార్డు వేగంతో సాగుతున్నాయి. గత నెల రోజుల్లోనే సుమారు రూ. 2 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఒకదాని వెంట ఒకటి ఇంత వేగంగా ప్రాజెక్టులు ఖరారు కావడం లేదని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి విజన్‌కు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం తోడవడంతో రాష్ట్రంలో పనుల వేగం పరుగులు పెడుతోంది.

సాగునీటి రంగంలో విప్లవం – వెలుగొండ, పోలవరం ప్రారంభం

సుమారు 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీని ద్వారా మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడే మెట్ట ప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఆ వెంటనే పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. 213 కిలోమీటర్ల మేర సాగే ఈ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల వెల్లువ

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించేందుకు రూ. 12,000 కోట్లతో పట్టణాభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 11,000 కోట్లతో ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించి 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులను అత్యున్నత స్థాయికి చేర్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.

రాయలసీమను ఫ్రూట్ బౌల్‌గా మార్చే లక్ష కోట్ల హబ్ – బుర్రిపాలెం 3డీ ఇళ్లు

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి మదనపల్లె కేంద్రంగా రూ. 1,00,000 కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టారు. అక్కడే ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు శంకుస్థాపన జరిగింది. మరోవైపు పేదల గృహనిర్మాణంలో సరికొత్త సాంకేతికతను జోడిస్తూ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల ఇళ్లతో పాటు దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటింగ్ ఇళ్ల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీకి మరో 6 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర గృహనిర్మాణ శాఖ సుముఖత వ్యక్తం చేసింది.

జలజీవన్ మిషన్ 2.0 – అమరావతి భారీ కనెక్టివిటీ ప్రాజెక్టులు

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ 2.0 కింద రూ. 30,000 కోట్లతో ‘జలధార’ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 27 లక్షల కొత్త కొళాయి కనెక్షన్లు, 13 వేల ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. రాజధాని అమరావతికి రూ. 30,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎన్‌హెచ్ఏఐ నాలుగు ప్యాకేజీల్లో టెండర్లు పిలిచింది. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా సరికొత్త రైల్వే లైన్ మరియు ఆధునిక రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల ప్రక్రియ మొదలైంది.

రామాయపట్నం రిఫైనరీ – ఏపీ పారిశ్రామిక పురోగతి

ప్రకాశం జిల్లా రామాయపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ. 1,00,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెగా రిఫైనరీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన జరగనుంది. నెల రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన పనులతో ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది.

Tags

Be the first to react

Latest