12వ పీఆర్సీ విధివిధానాలు విడుదల.. ఉద్యోగులకు డెడ్ లైన్ ఇదే..!

AP Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్సీ విధివిధానాలు వెల్లడయ్యాయి. డీఏ విలీనం, కొత్త పే స్కేళ్లు, అలవెన్సులు, పెన్షన్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ వంటి అంశాలను కమిషన్ పరిశీలించనుంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ సూచనలు, అభ్యంతరాలను 2026 డిసెంబర్ 31లోగా సమర్పించాలి.

ఏపీ ఉద్యోగుల జీతాల పెంపుపై కసరత్తు
ఏపీ ఉద్యోగుల జీతాల పెంపుపై కసరత్తు
  • ఏపీ ఉద్యోగుల జీతాల పెంపుపై కసరత్తు.. పీఆర్సీ పరిశీలించే అంశాలివే!

  • డీఏ విలీనం నుంచి పెన్షన్ల వరకు.. 12వ పీఆర్సీ ముందున్న కీలక అంశాలు

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. మీ అభ్యంతరాలు చెప్పేందుకు ఇదే చివరి తేదీ!

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం 12వ పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2026 అక్టోబర్ 1న జారీ చేసిన జీఓ నంబర్ 200 ద్వారా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను పీఆర్సీ కమిషనర్‌గా నియమించింది. కమిషన్ తన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఏడాదిలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కమిషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది, వర్క్‌చార్జ్డ్ ఉద్యోగులు, పూర్తికాలపు కంటింజెంట్ ఉద్యోగులు ఉంటారు. వీరి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలను పరిశీలించి తగిన సిఫారసులు చేయనుంది.

ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న కరువు భత్యం (డీఏ)లో ఎంత మొత్తాన్ని మూలవేతనంలో విలీనం చేయవచ్చనే అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించనుంది. డీఏ విలీనం తర్వాత కొత్త వేతన స్కేళ్లను ఎలా రూపొందించాలి? సవరించిన వేతనాలను ఏ విధంగా నిర్ణయించాలి? అనే అంశాలపై సిఫారసులు చేయనుంది.

ఉద్యోగులకు వర్తిస్తున్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో ఎదురవుతున్న సమస్యలను కూడా అధ్యయనం చేయనుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించాలా? లేక మార్పులు చేయాలా? అనే అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.

ఇక ఉద్యోగులకు అందుతున్న స్పెషల్ పే, కన్వెన్షన్ అలవెన్సులు, ఇతర ప్రత్యేక భత్యాలపై కూడా కమిషన్ దృష్టి సారించనుంది. ప్రస్తుతం ఇస్తున్న భత్యాలు అవసరమా? వాటి రేట్లు, నిబంధనల్లో ఏమైనా మార్పులు చేయాలా? అనే అంశాలను పరిశీలించనుంది.

పెన్షనర్లకు సంబంధించిన అంశాలు కూడా 12వ పీఆర్సీ పరిశీలనలో ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులపై సిఫారసులు చేయనుంది. అలాగే కొన్ని ఉద్యోగ కేటగిరీల పోస్టులను గెజిటెడ్ హోదాలోకి మార్చేందుకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన మానవ వనరుల అవసరాలను కమిషన్ అధ్యయనం చేయనుంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డిప్యుటేషన్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటు శాఖల్లో సిబ్బంది అవసరాలు, నియామకాలు, సర్వీసు నిబంధనలను కూడా పరిశీలించనుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే తుది సిఫారసులు రూపొందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అయితే యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్ వేతన స్కేళ్ల ప్రకారం జీతాలు పొందుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల బోధనా సిబ్బంది ఈ కమిషన్ పరిధిలోకి రారు. అలాగే రెండో జాతీయ న్యాయ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు పొందుతున్న న్యాయాధికారులకు కూడా 12వ పీఆర్సీ వర్తించదు.

ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, సంబంధిత సంస్థలు, వ్యక్తిగత ఉద్యోగులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, ప్రతిపాదనలను రాతపూర్వకంగా సమర్పించవచ్చు. వాటిని పీఆర్సీ కార్యదర్శికి ఏపీ సచివాలయం, వెలగపూడి చిరునామాకు పంపవచ్చు. అలాగే [email protected] అనే ఈమెయిల్ ద్వారా కూడా పంపే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు చివరి తేదీ 2026 డిసెంబర్ 31.

ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత పీఆర్సీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అయితే ప్రస్తుతం వెల్లడైనవి కమిషన్ పరిశీలించాల్సిన అంశాలు మాత్రమే. ఫిట్‌మెంట్ శాతం, కొత్త వేతన స్కేళ్లు, బకాయిల చెల్లింపు, కొత్త జీతాల అమలు తేదీపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.

Tags

Be the first to react

Latest