భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరంగా అనిపించే అంశాల్లో రోహిత్ శర్మ – కుల్దీప్ యాదవ్ మధ్య ఉన్న మైదానంలోని అనుబంధం ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుల్దీప్ తరచూ ఎల్‌బీడబ్ల్యూ అప్పీళ్లపై డీఆర్‌ఎస్ తీసుకుందామని రోహిత్‌ను కోరడం, దానికి రోహిత్ సరదాగా తిరస్కరించడం అందరికీ తెలిసిన విషయమే అయినా. ఇదే అంశం మరోసారి మైదానంలో నవ్వులు పూయించింది. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కుల్దీప్‌కు ఏమైనా సలహా ఇస్తారా అని ప్రశ్నించగా, రోహిత్ తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు.
అతనికి సలహాలు అవసరం లేదు. తన పని తాను చేసుకుంటూ బంతి వేయాలి. ప్రతి బంతికి అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు అంటూ రోహిత్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అనుభవం కలిగిన కెప్టెన్‌గా రోహిత్ చెప్పిన ఈ మాటల్లో సరదా ఉన్నప్పటికీ, అందులో స్పష్టమైన సందేశం కూడా దాగి ఉంది. ఆటగాళ్లు మైదానంలో ఆత్మవిశ్వాసంతో తమ పాత్రను పోషించాలన్నదే ఆయన ఉద్దేశం.
కుల్దీప్ యాదవ్ ఇప్పటికే భారత జట్టుకు కీలక స్పిన్నర్‌గా మారిపోయాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లు పడగొట్టాడు. ఆ విజయంతో భారత జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఆ జట్టులో భాగమైన ఎనిమిది మంది ఆటగాళ్లలో కుల్దీప్ ఒకరు కావడం విశేషం. ఇప్పుడు 2026 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో అతడు సిద్ధమవుతున్నాడు.
అయితే జట్టులో తుది ఎలెవన్ ఎంపిక మాత్రం పెద్ద సవాల్‌గా మారనుంది. ముఖ్యంగా కుల్దీప్‌తో పాటు ఫామ్‌లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఒకేసారి ఎలా ఆడించాలన్నది టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద ప్రశ్న. రోహిత్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇద్దరినీ ఆడించాలంటే కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతోనే జట్టును సిద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టడం కూడా కష్టం. ఇటు కుల్దీప్ అనుభవం, అటు వరుణ్ ఫామ్… ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం టీమిండియాకు కీలకంగా మారింది.
రోహిత్ చేసిన సరదా వ్యాఖ్యలు కేవలం నవ్వుల కోసమే కాకుండా, రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎదుర్కొనే సవాళ్లను కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. అనుభవం, ఫామ్, వ్యూహం అన్నీ సమన్వయమైతేనే మరోసారి భారత జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉందన్న సంకేతాలను ఈ వ్యాఖ్యలు ఇస్తున్నాయి.