ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి అలాగే ఒకేషనల్ కోర్సుల పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మార్చి నెలలో జరగనున్న ఈ పరీక్షలకు విద్యార్థులు ముందుగానే సిద్ధమయ్యేలా టైం టేబుల్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. అన్ని ప్రధాన పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ముగుస్తాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యంగా వచ్చిన వారికి ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.
పరీక్షల తేదీల వివరాలను పరిశీలిస్తే..
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది.
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష,
మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తారు.
మార్చి 23న గణిత పరీక్ష జరగనుంది.
మార్చి 25న ఫిజికల్ సైన్స్ పరీక్ష,
మార్చి 28న బయోలాజికల్ సైన్స్ పరీక్ష
మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలతో విద్యార్థుల పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి.
ప్రధాన పరీక్షల అనంతరం ఓఎస్ఎస్సి మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2తో పాటు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరుగుతుంది. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2తో పాటు ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే సైన్స్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక పేపర్లు మరియు ఒకేషనల్ కోర్సుల పరీక్షలు ఉదయం 11 గంటల 30 నిమిషాలకే ముగుస్తాయని అధికారులు తెలిపారు.
ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితాను అనుసరించేలా ఈ టైం టేబుల్‌ను రూపొందించినట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా క్రమబద్ధమైన ప్రణాళికతో చదువుపై దృష్టి పెట్టాలని, పరీక్షల సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.