ఆంధ్రప్రదేశ్‌లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, ఇప్పటికే పాఠశాలలు పరీక్షల ఏర్పాట్లపై దృష్టి సారించాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
టైం టేబుల్ ప్రకారం, సాధారణ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ వంటి సబ్జెక్టులకు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు మాత్రమే జరగనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష ప్రారంభానికి ముందే హాల్ టికెట్లు పంపిణీ చేయనున్నట్లు, విద్యార్థులు అవసరమైన స్టేషనరీతో పాటు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు హెచ్చరించారు.
పూర్తి టైం టేబుల్‌ను పరిశీలిస్తే, మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షతో పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష జరగనుంది. మార్చి 23న గణితం పరీక్ష నిర్వహించగా, మార్చి 25న ఫిజికల్ సైన్స్ పరీక్ష, మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష జరుగుతాయి. చివరగా మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులకు మధ్య మధ్యలో సరిపడా గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సెలవులు లేదా అనివార్య పరిస్థితులు ఏర్పడితే టైం టేబుల్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే పరీక్షల సమయంలో ప్రశ్నపత్రం తారుమారు కావడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరిగితే సంబంధిత అభ్యర్థుల ఫలితాలను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ సూచించింది.