ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశ భవిష్యత్తుకు ఒక పెద్ద అవకాశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సమాజంలో సానుకూల మార్పును తీసుకురావాలంటే అది అన్ని వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో ఉండాలని ఆమె అన్నారు. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ ది నేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒడిశాలోని రయ్రంగపుర్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రం, స్కిల్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్న దశలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో దేశ జీడీపీ, ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెరుగుదలకు ఏఐ ప్రధాన చోదక శక్తిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్న లక్ష్యంలో ఆధునిక సాంకేతికత కీలకంగా నిలుస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. ఏఐ ల్యాబ్‌లు, కొత్త తరహా లెర్నింగ్ మాడ్యూల్‌ల ద్వారా విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు పెంపొందుతాయని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే టెక్నాలజీపై అవగాహన పెరిగితే, రేపటి నాయకత్వానికి పునాది పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను విద్యార్థులు, యువత తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. సంపాదించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా సమాజ సేవకు, దేశ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఐ లెర్నింగ్ మాడ్యూల్స్ పూర్తి చేసిన పార్లమెంట్ సభ్యులను ఆమె అభినందించారు. నిరంతర అభ్యాసం ప్రజాప్రతినిధుల నాయకత్వంలో కూడా ప్రతిబింబిస్తుందని అన్నారు.
డేటా సైన్స్, ఏఐ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటాయని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ రంగాల్లో నైపుణ్యం సాధించిన యువత దేశానికి బలమైన ప్రతిభావంతులుగా మారతారని చెప్పారు. సామాజిక, ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను తగ్గించేందుకు ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
బాధ్యతాయుతమైన, సమ్మిళిత సాంకేతిక భవిష్యత్తును నిర్మించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశాన్ని ‘వికసిత్ భారత్’ దిశగా తీసుకెళ్లాలంటే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని, భారత్‌ను ప్రపంచ ఏఐ లీడర్‌గా నిలబెట్టేందుకు ఇండియా ఏఐ మిషన్ అమలు చేస్తున్నామని వివరించారు.
ఇటీవల ఝార్ఖండ్ పర్యటనలో గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రాష్ట్రపతి, చదువే వారి ఎదుగుదలకు కీలక మార్గమని గుర్తు చేశారు. విద్యావంతులు గ్రామాలకు తిరిగి వెళ్లి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను స్థానికులకు వివరించాలని పిలుపునిచ్చారు. గిరిజనులు, బడుగు వర్గాల సమ్మిళిత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అంకితమై ఉందని ఆమె స్పష్టం చేశారు.