సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు కిక్కు దిగే షాక్ ఇచ్చింది. పండుగ సమయంలో మద్యం విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనాలు ఉన్న వేళ, ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు ఊళ్లకు వెళ్లిన యువత, స్నేహితులతో కలసి మద్యం సేవించేందుకు సిద్ధమయ్యే ఈ సమయంలో ధరలు పెరగడంతో మద్యం ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా కోళ్ల పందేలు జరిగే ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం తెలిసిందే. అలాంటి వేళ ధరలు పెంచడం వల్ల పండుగ పూట మద్యం తాగాలంటే జేబుకు మరింత చిల్లు పడే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్పీ ధర కలిగిన మద్యం బాటిళ్లను మినహాయించి మిగతా అన్ని రకాల మద్యం బాటిళ్లపై ధరలను పెంచారు. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ వంటి అన్ని రకాల మద్యం సైజులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంపు అమలులోకి తీసుకొచ్చారు. అయితే రూ.99లోపు ఉన్న బీర్, వైన్, ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లకు ధరలు పెంచకుండా ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ధరలు పెరగడం వల్ల మద్యం విక్రయాల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. పండుగ సీజన్లో డిమాండ్ అధికంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా వినిపిస్తోంది.
ఇక మరోవైపు రిటైల్ మద్యం షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. రూ.99లోపు ఉన్న మద్యం బాటిళ్లపై రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను ఒక శాతం పెంచడంతో వారికి కొంత లాభం చేకూరనుంది. అయితే పండుగ సమయాల్లో మద్యం ధరలు పెంచడంపై మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బార్లు, వైన్ షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.