సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరట కలిగించేలా ఆర్థిక శాఖ రూ.2,653 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 5.7 లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. పండుగ వేళ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఏ ఎరియర్స్‌తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వం సానుకూల సందేశం ఇచ్చింది.
ఈ నిధుల విడుదలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, డీఏ ఎరియర్స్ చెల్లింపుల కోసం రూ.1,100 కోట్లు కేటాయించారు. అలాగే పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్ లీవ్స్ బకాయిల చెల్లింపుల కోసం రూ.110 కోట్లను మంజూరు చేశారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలు క్లియర్ కావడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పండుగ ఖర్చుల వేళ ఈ నిధులు అందుబాటులోకి రావడం ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారింది.
ఇదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల కింద చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సాస్కీ, ఈఏపీ, నాబార్డ్, సీఆర్‌ఐఎఫ్ వంటి పథకాలకు సంబంధించిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం మొత్తం రూ.1,243 కోట్లను విడుదల చేసింది. దీంతో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలని అధికారులు ఆశిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం ఇచ్చిన ఈ శుభవార్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పండుగ సమయంలోనే ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 ధర పెంపు అమలులోకి తీసుకొచ్చింది. అయితే రూ.99 ధర ఉన్న 180 ఎంఎల్ ఐఎంఎఫ్ఎల్, బీరు, వైన్, ఆర్‌టిడీలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు కానుక, మరోవైపు మద్యం ధరల పెంపుతో ప్రభుత్వం సమతుల్య నిర్ణయాలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.