వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ అలర్ట్ జారీ చేశాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఈకేవైసీ చేయని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రభుత్వం అందించే సబ్సిడీలు కూడా నిలిచిపోతాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.500 రాయితీ మొత్తం కూడా కట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఉజ్వల లబ్ధిదారులే కాకుండా సాధారణ వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఈ ఈకేవైసీ ప్రక్రియను కొంతకాలంగా అమలు చేస్తున్నప్పటికీ, ఇంకా చాలామంది వినియోగదారులు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఈ డెడ్‌లైన్‌లోపు ఈకేవైసీ పూర్తిచేయని వారు భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ రీఫిల్ పొందడంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. అలాగే బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యే సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వంట గ్యాస్ వినియోగదారులంతా చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
ఈకేవైసీ పూర్తి చేసుకోవడం చాలా సులభమని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది. అందులో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వివరాలు ఇవ్వడం ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది. లేదా మీరు సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్స్, వెబ్సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది. సందేహాలుంటే www.pmuy.gov.in/e-kyc.html వెబ్సైట్ లేదా ఆయిల్ ఇండస్ట్రీ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రదించవచ్చు.
ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు తెలిపారు. కేంద్ర ఆయిల్ కంపెనీలు ఇప్పటికే ఇచ్చిన గడువు ముగిసిందని, చివరిసారిగా జనవరి 31 వరకు మాత్రమే అవకాశం ఇచ్చాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భద్రతాపరమైన అంశాలపైనా ఆయన కీలక సూచనలు చేశారు. నాణ్యత లేని స్థానిక రబ్బర్ ట్యూబులు వాడటం వల్ల గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయని, వినియోగదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర ఉన్న ట్యూబులనే వాడాలని సూచించారు. ఈకేవైసీతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.