దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ రికార్డు స్థాయికి చేరుతుండటంతో అక్రమ బంగారం రవాణా కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు ఎంత కఠినంగా నిఘా పెట్టినా, స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులతో అధికారులను మోసం చేస్తున్నారు. తాజాగా ‘గోల్డ్ పేస్ట్’ రూపంలో జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పద్ధతిలో బంగారాన్ని గుర్తించడం అత్యంత క్లిష్టంగా మారడంతో స్మగ్లర్లు దీనిని ప్రధాన ఆయుధంగా మార్చుకుంటున్నారు.
ఈ ప్రమాదకరమైన ట్రెండ్‌కు చైన్నై అన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నిదర్శనం. దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమాన సిబ్బందిలోని ఒకరిని అనుమానంతో అదుపులోకి తీసుకున్న AIU అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో అతడి ఛాతీ, నడుము చుట్టూ వెల్క్రో బ్యాండ్లలో దాచిన 10 ప్యాకెట్ల గోల్డ్ పేస్ట్ బయటపడింది. వాటిని శుద్ధి చేయగా మొత్తం 9.46 కిలోల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.11.4 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటన దేశంలో గోల్డ్ పేస్ట్ స్మగ్లింగ్ ఎంత తీవ్రమైన స్థాయికి చేరిందో స్పష్టంగా చూపిస్తోంది.
ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, నిర్దిష్ట సమాచారం లేకుండా గోల్డ్ పేస్ట్‌ను గుర్తించడం దాదాపు అసాధ్యమే. అత్యాధునిక బాడీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు కూడా ఈ పదార్థాన్ని సులభంగా గుర్తించలేవని అధికారులు చెబుతున్నారు. సాధారణ లోహాల్లా స్పందించని ఈ పేస్ట్ కారణంగా యంత్రాలకంటే మానవ నిఘాపైనే అధికారులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. స్మగ్లర్ ప్రవర్తన, నడక, శరీర కదలికలు, ప్రయాణ చరిత్రలోని అసాధారణ అంశాలే కీలక ఆధారాలుగా మారుతున్నాయి. చిన్న పొరపాటు జరిగితే తప్ప, ఇది గోల్డ్ పేస్ట్ అని నిర్ధారించడం కష్టమేనని అధికారులు అంగీకరిస్తున్నారు.
దేశీయంగా బంగారానికి ఉన్న అధిక డిమాండ్, దిగుమతులపై భారీ పన్నులు, పెరుగుతున్న ధరలే ఈ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలని ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. ఒక కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పన్నులు ఎగ్గొట్టడం ద్వారా రూ.15 లక్షలకుపైగా లాభం వచ్చే అవకాశం ఉండటంతో స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్వచ్ఛమైన బంగారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, ఇతర రసాయన మలినాలు కలిపి పేస్ట్‌గా తయారు చేసి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్నారు. అనంతరం ప్రత్యేక రసాయన ప్రక్రియల ద్వారా మళ్లీ బంగారాన్ని వేరు చేస్తున్నారు. గతంలో సూరత్ విమానాశ్రయంలో 28 కిలోల గోల్డ్ పేస్ట్ పట్టుబడిన ఘటనతో పాటు, ప్రస్తుతం చైన్నై, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల్లో మానవ వనరుల నిఘా, ప్రొఫైలింగ్ ద్వారానే అధికారులు పెద్ద ఎత్తున గోల్డ్ పేస్ట్ స్మగ్లింగ్‌ను అడ్డుకుంటున్నారు.