అమెరికాలో 27 ఏళ్ల భారతీయ యువతి నిఖిత గోడిశాల(NikithaGodishala) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మకు చెందిన అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురై రక్తపుమడుగులో మృతదేహంగా లభ్యమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టారు. నిఖిత మరణం అత్యంత దారుణంగా జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అర్జున్ శర్మపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిఖితను హత్య చేసిన అనంతరం అతడు భారత్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు హోవార్డ్ కౌంటీ పోలీసులు యూఎస్ ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు.
నిఖిత కనిపించట్లేదని తొలుత అర్జున్ శర్మే హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. న్యూ ఇయర్ ఈవ్ రోజు నుంచి ఆమె అదృశ్యమైందని, చివరిసారిగా కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లోనే చూసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన అదే రోజున అర్జున్ శర్మ భారత్‌కు వెళ్లినట్టు సమాచారం అందడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే పోలీసులు అతని అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయడానికి సెర్చ్ వారెంట్ పొందారు. జనవరి 3న డిటెక్టివ్‌లు శర్మ ఫ్లాట్‌ను తనిఖీ చేయగా, నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటంతో తీవ్ర రక్తస్రావం వల్లనే మరణించినట్లు నిర్ధారించారు.
డిసెంబర్ 31 రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిపై అరెస్ట్ వారెంట్ అమల్లోకి తెచ్చారు. ఈ హత్య వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనను వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ధృవీకరించి, నిఖిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.