ఏపీలోని రైతులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధుల విడుదలపై నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.14 వేల చొప్పున రైతులకు అందించామని, మూడో విడత నిధులు కూడా అదే తరహాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. పంట సీజన్ ప్రారంభమై ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ నిధులు రైతులకు ఊరటనిచ్చేలా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో, అదే సమయంలో రాష్ట్ర వాటాను కూడా కలిపి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు ఒకేసారి నిధులు అందే అవకాశం ఏర్పడింది. ఈ పథకం కింద ఏడాదికి మొత్తం రూ.20 వేల చొప్పున రైతులకు అందజేస్తుండగా, వాటిని మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు. తొలి రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున, మూడో విడతలో రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు.
ఇక పంట నష్టపోయిన రైతులకూ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మొత్తం 37,752 మంది రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం జమ చేశామని తెలిపారు. ఈ మేరకు రూ.128.33 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో సమీక్షించి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు కలిగి, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అందే అవకాశం ఉంది. రైతులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు స్థితిని అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో నిధులు విడుదల కానున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు పెరిగాయి. పెట్టుబడులకు ఉపయోగపడే ఈ సాయంతో సాగు పనులు సజావుగా సాగుతాయని రైతులు భావిస్తున్నారు.