బిర్యానీ పేరు వింటేనే నోరూరని వారుండరు ముఖ్యంగా శాకాహారులకు 'పనీర్ దమ్ బిర్యానీ' అంటే అమితమైన ఇష్టం. అయితే, ఇంట్లో చేసేటప్పుడు పనీర్ ముక్కలు విడిపోవడం లేదా బిర్యానీ ముద్దగా అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా కాకుండా, పక్కా రెస్టారెంట్ రుచితో, పొడిపొడిగా వచ్చే పనీర్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
బాస్మతీ రైస్: 3 గ్లాసులు (అరగంట పాటు నానబెట్టినవి)
పనీర్: 200 గ్రాములు (క్యూబ్స్‌లా కోసినవి)
మసాలా పేస్ట్ కోసం: టమోటాలు, అల్లం-వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా.
పొడి మసాలాలు: కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కసూరీ మేతీ.
ఇతరాలు: పెరుగు (అర కప్పు), నూనె, నెయ్యి, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్.
తయారీ విధానం:
మసాలా ప్రిపరేషన్:
ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి టమోటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మరియు కొద్దిగా షాజీరా వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని, అందులో పెరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి.
పనీర్ మ్యారినేషన్
సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమంలో పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు పచ్చి బఠానీలు మరియు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. దీనికి కొద్దిగా కసూరీ మేతీ, నెయ్యి జోడించి ముక్కలకు మసాలా పట్టేలా కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
రైస్ ఉడికించడం
మరోవైపు పొయ్యి మీద ఎసరు పెట్టి, అందులో ఉప్పు, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతీ రైస్ వేసి 80 శాతం వరకు మాత్రమే ఉడికించాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం.
దమ్ ప్రక్రియ
ఒక మందపాటి గిన్నె తీసుకుని అడుగున కొద్దిగా నూనె రాయాలి. దానిపై ముందుగా మ్యారినేట్ చేసిన పనీర్ మిశ్రమాన్ని ఒక లేయర్‌లా పరచాలి. దానిపై ఉడికించిన రైస్‌ను సమానంగా వేయాలి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి మరియు కొద్దిగా కుంకుమపువ్వు కలిపిన పాలు చల్లుకోవాలి.
ఆవిరి బయటకు పోకుండా గిన్నెపై అల్యూమినియం ఫాయిల్ లేదా మూత పెట్టి గోధుమ పిండితో సీల్ చేయాలి. మంటను సిమ్ లో ఉంచి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. స్టౌ ఆపివేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి. అంతే! ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే పనీర్ దమ్ బిర్యానీ సిద్ధం. దీనిని రైతాతో వేడివేడిగా వడ్డిస్తే ఆ రుచే వేరు ఇంకెందుకు ఆలస్యం మరి ట్రై చేయండి