ఆహా ఏమి రుచి తినగా మైమరిచి… పాట కాదండోయ్, మన అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒక్కసారి నల్ల కారంనీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి అలా వేసుకుని తింటే ఉంటుంది ఆ రుచికి చికెన్ కూడా సరిపోదండోయ్ అంత బాగుంటుంది. ప్రస్తుత కాలంలో పిజ్జా, చికెన్, కేఎఫ్‌సీ అంటూ నేటి యువత ఫాస్ట్ ఫుడ్‌కే ఎక్కువగా అలవాటు పడుతోంది. అలాగే నేటి మోడ్రన్ మదర్స్‌కూ నల్ల కారం ఎలా తయారు చేయాలో తెలియకపోవడం నిజంగా బాధాకరమైన విషయమే అని చెప్పుకోవాలి.అమ్మమ్మల కాలం నాటి నల్ల కారాన్ని మనమే తయారు చేసేద్దాం… వచ్చేయండి.
తరతరాలుగా మన పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చిన జీవన విధానం, ఆరోగ్య రహస్యాలు, భావోద్వేగ అనుబంధం అన్నీ కలిసి ఉన్న సంప్రదాయ వంటల్లో నల్ల కారం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. నల్ల కారం అనే పేరు వినగానే చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకొస్తాయి.
నల్ల కారం తయారీలో ఉపయోగించే పదార్థాలు చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు,చింతపండు కరివేపాకు వంటి పదార్థాలే దీనికి అమోఘమైన రుచిని అందిస్తాయి. కానీ పదార్థాలకన్నా ముఖ్యమైనది వాటిని ఎలా వేయిస్తున్నాం, ఎంత ఓపికతో చేస్తున్నాం అన్నదే తుది రుచిని నిర్ణయిస్తుంది. మీడియం మంటపై నిదానంగా వేయించడం ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ. ఈ విధంగా నెమ్మదిగా వేయించినప్పుడు పదార్థాలకు ముదురు రంగు వస్తుంది. అదే నల్ల కారానికి ప్రత్యేకమైన గుర్తింపు. ఆ తర్వాత వాటిని దంచేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. పూర్తిగా మెత్తగా పొడిచేస్తే రుచి తగ్గిపోతుంది. అలాగే చాలా గట్టిగా ఉంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మధ్యస్థ టెక్స్చర్ వచ్చేలా దంచడం చాలా ముఖ్యం.
ఇలా తయారైన నల్ల కారం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అది నిజంగా ఒక విందులా అనిపిస్తుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి సాధారణ టిఫిన్లకూ ఇది అదనపు రుచిని ఇస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు కూడా నల్ల కారం వేడివేడి అన్నంలో తింటే చేదుగా ఉన్న నోరు కాస్త టేస్ట్ తెలిసేలా ఉంటుంది. బాలింతలకు సైతం ఈ నల్ల కారంని పెడుతుంటారు.
తెలుగువారి సంప్రదాయ వంటల్లో నల్ల కారం ఒక సాధారణ పొడిగా కాదు, అసలైన రుచికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది గాఢమైన రుచి, ఘాటైన వాసన కలిగిన ప్రత్యేకమైన పొడి. బయట మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పొడులతో పోలిస్తే, ఇంట్లో నిదానంగా తయారుచేసిన నల్ల కారం రుచి మాటల్లో చెప్పలేనిది. దీన్ని తయారు చేయాలంటే తొందరపడకుండా ఓపికగా చేయాల్సిందే. అదే నల్ల కారం అసలు సీక్రెట్.
నల్ల కారం కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వంటి పదార్థాలు జీర్ణశక్తిని పెంచుతాయని నమ్మకం. అందుకే పాత రోజుల్లో తప్పనిసరిగా నల్లగారం చేసుకుని ఆ పూట కూర లేకపోతే ఇది వేసుకొని తినేవారట..