ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులకు యోగా, డ్రిల్, క్రీడలు, ఆరోగ్య విద్యను బోధించాలి. ప్రతి తరగతికి వారానికి మొత్తం ఆరు పీరియడ్లు వ్యాయామానికి కేటాయించాలి. అంతేకాకుండా ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట పాటు ఏదో ఒక శారీరక శ్రమలో పాల్గొనాల్సిందే అని స్పష్టం చేశారు.
విద్యార్థుల ఏకాగ్రత పెంచే దిశగా రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేశారు. ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో పది నిమిషాల ధ్యానం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే వారానికి ఒక పీరియడ్‌ను ప్రత్యేకంగా ఆరోగ్య విద్య సిలబస్‌కు కేటాయించాలని సూచించారు. దీని ద్వారా పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఆదేశాలతో ప్రైవేట్ పాఠశాలలు తమ టైమ్ టేబుల్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. విద్యాశాఖ ఇప్పటికే కొత్త టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారమే బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని స్కూళ్లకు స్పష్టం చేసింది. ఇటీవల పదో తరగతి విద్యార్థులకు కూడా యోగాను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
వ్యాయామ విద్యతో పాటు నైతిక విలువల బోధన కూడా అవసరమని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు కూడా ఎంతో అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల సర్వాంగీణ అభివృద్ధికి దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.