US attack oil tanker: సంచలనం.. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిస్సైల్ దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్!

US attack oil tanker: గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఉండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

US attack oil tanker: సంచలనం.. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిస్సైల్ దాడి..
us-attack-on-tanker-vizag-sailor-among-dead
  • త్వరలో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా విషాదం..

  • ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై అమెరికా సైన్యం దాడి..

గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జూన్ 10న 'ఎంటీ సెటెబెల్లో' అనే చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఈ దాడికి పాల్పడింది. ఇరాన్పై విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురు రవాణా చేస్తున్నారని, తమ ఆదేశాలను పాటించకపోవడంతోనే నౌకలోని ఇంజిన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అమెరికా వైమానిక దాడుల ప్రభావంతో ఆ నౌకలో భారీగా మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించడమే కాకుండా, అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని అమెరికా ప్రభుత్వానికి తన నిరసనను బలంగా తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ఖండిస్తూ దౌత్యపరంగా నిరసన వ్యక్తం చేయగా, నౌకలో ఉన్న మిగిలిన 21 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు కేంద్ర ఓడరేవులు, రవాణా శాఖ మంత్రి శరబానంద సోనోవాల్ స్పష్టం చేశారు. మరణించిన నావికుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.

ఈ దారుణమైన దాడిలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ (44), డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అక్కడికక్కడే మరణించారు. మృతుడు సురేష్కు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే వారు తమ 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గత ఐదు నెలలుగా నౌకలో విధుల్లో ఉన్న సురేశ్, త్వరలోనే సెలవుపై ఇంటికి రావలసి ఉందని, ఇందుకోసం ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా లభించిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదిత్య శర్మ కుటుంబ సభ్యులు సైతం ఈ ఘటనపై స్పందిస్తూ, నౌకను హై-రిస్క్ జోన్లోకి ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చిందనే దానిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Be the first to react

Latest