H-1B నుంచి గ్రీన్ కార్డ్ వరకు.. తానా ‘ఇమ్మిగ్రేషన్ 360°’లో సమగ్ర అవగాహన!

Immigration 360° Webinar: అమెరికాలో ఇమిగ్రేషన్‌ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో.. వీసాలు, ఉద్యోగాలు, విద్య, ప్రయాణం, లీగల్ స్టేటస్ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

Immigration 360 Webinar
Immigration 360 Webinar

మారుతున్న US ఇమ్మిగ్రేషన్ రూల్స్.. తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు తానా మార్గదర్శనం..

అమెరికా ఇమిగ్రేషన్‌పై తెలుగు వారికి అవగాహన.. తానా ‘ఇమిగ్రేషన్‌ 360°’ సదస్సు..

అమెరికాలో ఇమిగ్రేషన్‌ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో.. వీసాలు, ఉద్యోగాలు, విద్య, ప్రయాణం, లీగల్ స్టేటస్ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఇమిగ్రేషన్‌ 360°’ పేరుతో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో జూమ్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు అమెరికాలోని పలువురు తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ప్రస్తుతం అమెరికా ఇమిగ్రేషన్‌ వ్యవస్థలో నిబంధనలు తరచూ మారుతున్న నేపథ్యంలో.. సరైన సమాచారం లేక అయోమయానికి గురవుతున్న విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇమిగ్రేషన్‌‌కు సంబంధించిన సాధారణ సమాచారం మాత్రమే కాకుండా, వ్యక్తిగత సమస్యలను న్యాయ నిపుణుడిని నేరుగా అడిగి తెలుసుకునే అవకాశం కూడా కల్పించడం ఈ సదస్సుకు ప్రత్యేకతగా నిలిచింది.

అనుభవజ్ఞుడైన అటార్నీతో సమగ్ర అవగాహన

సదస్సులో ఇమిగ్రేషన్‌ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు, గ్రీన్ కార్డు ప్రక్రియ, కుటుంబ ఆధారిత ఇమిగ్రేషన్‌, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవల వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు వంటి అంశాలను ఆయన సవివరంగా వివరించారు.

హెచ్-1బీ, ఎఫ్-1 వంటి కీలక వీసా విభాగాలపై కూడా అవగాహన కల్పించారు. ఉద్యోగ అనుమతులు (Employment Authorization), ఉద్యోగ మార్పులు, రిమోట్ వర్క్‌కు సంబంధించిన మార్గదర్శకాలు, ఇమిగ్రేషన్‌ అప్లికేషన్లలో ఎదురయ్యే సమస్యలు, స్టేటస్ కొనసాగింపునకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై పాల్గొన్నవారికి స్పష్టత ఇచ్చారు.

విద్యార్థులు, యూనివర్సిటీలకు కీలక సూచనలు

అంతర్జాతీయ విద్యార్థులకు ఇమిగ్రేషన్‌ విషయంలో పాటించాల్సిన నిబంధనలు, యూనివర్సిటీ స్థాయిలో అవసరమైన జాగ్రత్తలు, ప్రయాణ సమయంలో వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, ప్రయాణ పరిమితులు తదితర అంశాలను కూడా అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి వివరించారు. వీసా స్థితి, ఉద్యోగం, చదువు లేదా అమెరికా బయటకు వెళ్లి తిరిగి వచ్చే సందర్భాల్లో ముందస్తు జాగ్రత్తలు అవసరమని వివరించారు.

వ్యక్తిగత సమస్యలను నేరుగా అడిగిన పాల్గొనేవారు

సదస్సులో పాల్గొన్న వారికి తమ వ్యక్తిగత ఇమిగ్రేషన్‌ సందేహాలను నేరుగా అడిగే అవకాశం కల్పించారు. ఉద్యోగం, విద్య, వీసా, ప్రయాణం, ఇమిగ్రేషన్‌ అప్లికేషన్లు, లీగల్ స్టేటస్ వంటి అంశాలపై పలువురు ప్రశ్నలు అడగగా.. అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి వాటికి సమాధానాలు ఇచ్చారు.

దీంతో సాధారణంగా ఇంటర్నెట్‌లో కనిపించే అస్పష్టమైన సమాచారంపై ఆధారపడకుండా, న్యాయ నిపుణుడి నుంచి సంబంధిత అంశాలపై అవగాహన పొందే అవకాశం తమకు లభించిందని పలువురు పాల్గొన్నవారు తెలిపారు.

ప్రశ్నావళితో ముందుగానే సమస్యల గుర్తింపు

సదస్సుకు ముందే కమ్యూనిటీ సభ్యుల సందేహాలను సేకరించేందుకు తానా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి చొరవతో ప్రత్యేక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్‌‌కు సంబంధించిన తమ సమస్యలు, సందేహాలను ముందుగానే అందులో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ముందుగా అందిన ప్రశ్నలను పరిశీలించి ఎక్కువ మందిని ప్రభావితం చేసే, అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలను వర్గీకరించారు. ఆ అంశాలను సదస్సులో ప్రత్యేకంగా చర్చించడంతో కార్యక్రమం మరింత ఉపయోగకరంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. దీంతో వ్యక్తిగత సమస్యలతో పాటు కమ్యూనిటీ స్థాయిలో ఎదురవుతున్న సాధారణ ఇమిగ్రేషన్‌ సమస్యలపై కూడా అవగాహన కల్పించేందుకు అవకాశం ఏర్పడింది.

‘ఇమిగ్రేషన్‌‌పై స్పష్టత అవసరం’

తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి మాట్లాడుతూ.. ఇమిగ్రేషన్‌ అనేది అనేక మంది భారతీయుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా మారిందన్నారు. రోజురోజుకూ మారుతున్న నిబంధనల కారణంగా విద్యార్థులు, ప్రొఫెషనల్ ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సరైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో ‘ఇమిగ్రేషన్‌ 360°’ సదస్సును నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సరైన మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.

తానా పెద్దలకు కృతజ్ఞతలు

కార్యక్రమానికి సహకరించిన తానా నాయకత్వానికి, పెద్దలకు డా. ఉమా ఆర్. కటికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

యాంకర్ లావణ్య గూడూరు కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రశ్నలను అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి ముందుకు తీసుకెళ్లి, వాటికి సమాధానాలు రాబట్టారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి అభినందనలు

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇమిగ్రేషన్‌‌పై ఇంత విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఉమా ఆర్. కటికి, ముఖ్య వక్తగా పాల్గొన్న అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడేలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.

పెద్ద సంఖ్యలో తెలుగు వారి భాగస్వామ్యం

అమెరికాలో ఉద్యోగాలు, విద్య, వ్యాపారం కోసం నివసిస్తున్న వేలాది మంది తెలుగువారికి ఇమిగ్రేషన్‌ నిబంధనలు, వీసా ప్రక్రియలు, అప్లికేషన్లు, స్టేటస్‌కు సంబంధించిన సమస్యలపై అవగాహన అవసరం. ఈ నేపథ్యంలో ‘ఇమిగ్రేషన్‌ 360°’ సదస్సు ఒక సమాచార వేదికగా ఉపయోగపడింది.

సరైన న్యాయ సమాచారంపై సందేహాలు ఉన్నవారికి తమ ప్రశ్నలను అడిగి నిపుణుడి నుంచి సమాధానాలు పొందే అవకాశం లభించింది. వ్యక్తిగత ఇమిగ్రేషన్‌ పరిస్థితులు ఒక్కొక్కరికి భిన్నంగా ఉండే అవకాశం ఉన్నందున, సాధారణ అవగాహనతో పాటు అవసరమైన సందర్భాల్లో అర్హత కలిగిన ఇమిగ్రేషన్‌ అటార్నీ నుంచి వ్యక్తిగత న్యాయ సలహా పొందడం ముఖ్యమని కార్యక్రమంలో వివరించారు.

కార్యక్రమ విజయానికి పలువురి సహకారం

‘ఇమిగ్రేషన్‌ 360°’ సదస్సు విజయవంతం కావడానికి తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, యూత్ కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ కోంపల్లి, ఓహియో వ్యాలీ రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం, శ్రీదేవి దొంతి, యాంకర్ లావణ్య గూడూరు తదితరులు సహకరించారు. వీరందరికీ డా. ఉమా ఆర్. కటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తానా నిర్వహించిన ఈ ‘ఇమిగ్రేషన్‌ 360°’ అవగాహన సదస్సు ద్వారా అమెరికాలోని తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర కమ్యూనిటీ సభ్యులు ఇమిగ్రేషన్‌‌కు సంబంధించిన అనేక అంశాలను ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం పొందారు. మారుతున్న నిబంధనల మధ్య సరైన సమాచారాన్ని చేరవేయడం, సందేహాలను న్యాయ నిపుణులతో చర్చించే వేదికను కల్పించడం ద్వారా ఈ కార్యక్రమం తెలుగు కమ్యూనిటీకి ఉపయోగకరమైన కార్యక్రమంగా నిలిచింది.

Tags

Be the first to react

Latest