అమెరికాలో విశాఖవాసుల ఆత్మీయ సమ్మేళనం.. ఘనంగా తొలి VISTA మీట్ అండ్ గ్రీట్..

Atlanta Telugu Community: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మదిలోనే ఉంటాయి. అలాంటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ అమెరికాలోని అట్లాంటాలో విశాఖవాసులు ఆత్మీయంగా కలుసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రవాసులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో VISTA (Visakhapatnam Individuals Supporting Togetherness in Atlanta) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘విశాఖపట్నం మీట్ అండ్ గ్రీట్’ (Visakhapatnam Meet & Greet) కార్యక్రమం ఘనంగా జరిగింది. అట్లాంటాలోని సంక్రాంతి రెస్టారెంట్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సుమారు 80 కుటుంబాలకు చెందిన 200 మంది చిన్నారులు, పెద్దలు హాజరై సందడి చేశారు.

Atlanta Telugu Community
Atlanta Telugu Community

అమెరికాలో ఘనంగా విశాఖవాసుల ఆత్మీయ సమ్మేళనం.. అట్లాంటాలో ఒక్కచోట చేరిన 80 కుటుంబాలు..

అట్లాంటాలో విశాఖవాసుల సందడి.. పాత స్నేహాలు, స్కూల్ జ్ఞాపకాలతో ప్రత్యేక వేడుక..

అట్లాంటా: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మదిలోనే ఉంటాయి. అలాంటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ అమెరికాలోని అట్లాంటాలో విశాఖవాసులు ఆత్మీయంగా కలుసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రవాసులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో VISTA (Visakhapatnam Individuals Supporting Togetherness in Atlanta) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘విశాఖపట్నం మీట్ అండ్ గ్రీట్’ (Visakhapatnam Meet & Greet) కార్యక్రమం ఘనంగా జరిగింది. అట్లాంటాలోని సంక్రాంతి రెస్టారెంట్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సుమారు 80 కుటుంబాలకు చెందిన 200 మంది చిన్నారులు, పెద్దలు హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమం ఆద్యంతం విశాఖ జ్ఞాపకాలతో ఆహ్లాదకరంగా సాగింది. ప్రియ, సురేష్ కరోతు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. విశాఖ నగర చరిత్ర, వాల్తేరు, వైజాగ్, స్టీల్ సిటీ వంటి పేర్ల వెనుక ఉన్న ప్రత్యేకతలు, నగరంలోని పాత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, ఆర్కే బీచ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ తమ చిన్ననాటి విశాఖ జ్ఞాపకాలను మరిచిపోలేదని పాల్గొన్నవారు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సమ్మేళనంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా పరిచయం కల్పించడం మరో విశేషం. వారు విశాఖలోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఏ పాఠశాల, కళాశాలలో చదువుకున్నారు? ప్రస్తుతం అమెరికాలో ఏ రంగాల్లో స్థిరపడ్డారు? అనే వివరాలను వేదికపై పంచుకున్నారు. దీంతో ఒకే ప్రాంతంలో నివసించినవారు, ఒకే పాఠశాల లేదా కళాశాలలో చదువుకున్నవారు చాలా కాలం తర్వాత మళ్లీ కలుసుకునే అవకాశం లభించింది. పాత స్నేహితులను, పరిచయస్తులను గుర్తుపట్టుకుంటూ పలువురు ఆనందం వ్యక్తం చేశారు. కొత్త పరిచయాలు కూడా ఏర్పడటంతో కార్యక్రమంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది.

విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, పాత సినిమా థియేటర్లు, ప్రసిద్ధ ప్రాంతాలు, మార్కెట్లపై నిర్వహించిన ప్రత్యేక క్విజ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు, మహిళలు కూడా వివిధ వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ స్వస్థలానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు పెద్దలు, యువత మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఈ కార్యక్రమం ద్వారా యువతకు విశాఖ చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది.

ఈ వేడుకలో ఆహారానికి కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. సంక్రాంతి రెస్టారెంట్ నిర్వాహకులు విశాఖ ప్రాంతీయ రుచులను గుర్తుచేసేలా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ వద్ద స్నేహితులతో గడిపిన రోజులను గుర్తుచేస్తూ కాగితపు పొట్లాల్లో అందించిన మురి మిక్చర్ అందరినీ ఆకట్టుకుంది. దీనితో పాటు కోడిగుడ్డు పులుసు, పులావ్, తీపి సేమియా వంటకాలు అతిథుల ప్రశంసలు అందుకున్నాయి. ఆహార రుచులతో పాటు వాటితో ముడిపడిన పాత జ్ఞాపకాలు కూడా ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

కార్యక్రమానికి హాజరైన అట్లాంటాలో స్థిరపడిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ జీవిత ప్రయాణాన్ని వివరించారు. అమెరికాకు వచ్చిన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎదురైన సవాళ్లు, కష్టపడి సాధించిన విజయాలను వివరించారు. ముఖ్యంగా యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. వారి అనుభవాలు అక్కడికి వచ్చిన యువతకు స్ఫూర్తినిచ్చాయి.

ఈ కార్యక్రమానికి వేదికను అందించడంతో పాటు విజయవంతానికి సహకరించిన సంక్రాంతి రెస్టారెంట్ నిర్వాహకులు శ్రీ నిమ్మగడ్డ శ్రీనివాస్, శ్రీమతి కవిత నిమ్మగడ్డ దంపతులను VISTA నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే డీజే, ఆడియో విజువల్ ఏర్పాట్లలో సహకరించిన Beats & Events శ్రీధర్ (SID) సేవలను అభినందించారు.

ఈ తొలి విశాఖవాసుల సమ్మేళనం విజయవంతం కావడంలో ఉప్పు శ్రీనివాస్, సురేష్ కరోతు, నిమ్మగడ్డ శ్రీనివాస్, ఆర్. ప్రసాద్, మండపాటి వెంకటపతిరాజు, కూనపురెడ్డి ప్రసాద్ తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమ ఏర్పాట్లు, కుటుంబాల సమన్వయం, వినోద కార్యక్రమాల నిర్వహణలో నిర్వాహకులు సమిష్టిగా కృషి చేశారు.

మొత్తంగా అట్లాంటాలో జరిగిన ఈ విశాఖవాసుల ఆత్మీయ సమ్మేళనం కేవలం ఒక సమావేశంగా కాకుండా, స్వస్థలంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసిన ప్రత్యేక వేడుకగా నిలిచింది. అమెరికాలో స్థిరపడినా తమ మూలాలను, చిన్ననాటి స్నేహాలను, విశాఖ సంస్కృతిని మరిచిపోలేదని పాల్గొన్న కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో మరిన్ని కుటుంబ, సాంస్కృతిక, యువజన కార్యక్రమాలను నిర్వహించి అట్లాంటాలోని విశాఖవాసుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని VISTA నిర్వాహకులు ఆకాంక్షించారు.

Tags

Be the first to react

Latest