బస్సుల కోసం ఎదురుచూపులకు చెక్.. విశాఖ యువకుడి వినూత్న ప్రయోగం
APSRTC Live Bus Tracking: ప్రజారవాణాలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతికతతో పరిష్కారం చూపించాడు విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు. బస్సు ఎక్కడుంది? మనం వేచి ఉన్న బస్‌స్టాప్‌కు ఎప్పుడు చేరుకుంటుంది? గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అందించేలా ‘ఫైండ్ మై బస్’ (Find My Bus) పేరుతో ఓ వినూత్న వెబ్‌సైట్‌ను రూపొందించాడు జ్ఞానేష్. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ వెబ్‌సైట్‌కు వేలాది మంది నుంచి మంచి స్పందన లభించింది.
- ఫైండ్ మై బస్’తో ఆర్టీసీ బస్సుల లైవ్ లొకేషన్, రాక సమయం తెలుసుకోవచ్చు.
- విశాఖ యువకుడు జ్ఞానేష్ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ఏపీ అంతటా విస్తరించారు.
APSRTC Live Bus Tracking: ప్రజారవాణాలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతికతతో పరిష్కారం చూపించాడు విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు. బస్సు ఎక్కడుంది? మనం వేచి ఉన్న బస్‌స్టాప్‌కు ఎప్పుడు చేరుకుంటుంది? గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అందించేలా ‘ఫైండ్ మై బస్’ (Find My Bus) పేరుతో ఓ వినూత్న వెబ్‌సైట్‌ను రూపొందించాడు జ్ఞానేష్. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ వెబ్‌సైట్‌కు వేలాది మంది నుంచి మంచి స్పందన లభించింది.
కళాశాల రోజుల్లో ఎదురైన సమస్యే ఆలోచనకు బీజం
విశాఖ నగరంలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. అయితే బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక బస్‌స్టాప్‌ల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి బస్సు వచ్చి వెళ్లిపోయిన విషయం కూడా తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.
ఇదే సమస్యను జ్ఞానేష్ తన కళాశాల రోజుల్లో ఎదుర్కొన్నారు. బస్సు కోసం ఎదురుచూస్తూ సమయం వృథా చేసుకోవడం, ఒక్కోసారి ఆటోలో వెళ్లాల్సి రావడంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఓ వెబ్‌సైట్ ఉంటే బాగుంటుందని భావించారు. అప్పట్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఆ ఆలోచనను అమలు చేయలేకపోయారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో ఐదేళ్లపాటు పనిచేసి కోడింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. దీంతో తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు.
బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు
‘ఫైండ్ మై బస్’ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న బస్సుల వివరాలను లైవ్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఏ బస్సు ఎక్కడ ఉంది? మన బస్‌స్టాప్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలను సులభంగా పరిశీలించవచ్చు. రైళ్ల కోసం ఉపయోగించే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’ తరహాలో ఆర్టీసీ బస్సుల కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ముందుగానే దాని రాక సమయాన్ని తెలుసుకోవచ్చు. బస్సు వచ్చే అవకాశం ఉందని తెలిస్తే అనవసరంగా ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుందని జ్ఞానేష్ చెబుతున్నారు.
ప్రయాణికుల సూచనలతో మరింత మెరుగైన సేవలు
జ్ఞానేష్ నిర్వహిస్తున్న ‘వైజాగ్ బ్లాగర్’ పేజీకి ఇప్పటికే 1.81 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగులే. వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
అంతేకాకుండా వెబ్‌సైట్‌లోని బస్‌స్టాప్‌లు, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ప్రయాణికులే సవరణల కోసం అభ్యర్థనలు పంపించేలా ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. అయితే ప్రయాణికులు పంపిన సమాచారాన్ని నేరుగా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయరు. ముందుగా సంబంధిత వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాతే మార్పులు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక వెరిఫికేషన్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
బస్సులను గుర్తించేందుకు ప్రత్యేక రంగులు
సాధారణ ప్రయాణికులకు కూడా సులభంగా అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో వివిధ రకాల బస్సులను ప్రత్యేక రంగులతో గుర్తించే సదుపాయం కల్పించారు. పల్లె వెలుగు, గ్రీన్ మెట్రో, ఎక్స్‌ప్రెస్ తదితర బస్సులను వేర్వేరు రంగుల ద్వారా గుర్తించవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులకు కూడా ప్రత్యేక రంగులను కేటాయించారు. మ్యాప్‌ను జూమ్ చేసి చూస్తే బస్సుల వివరాలను సులభంగా గుర్తించవచ్చు.
ఏపీ ఆర్టీసీ డేటాతో లైవ్ ట్రాకింగ్
ఈ వెబ్‌సైట్ రూపకల్పనలో జ్ఞానేష్ పలు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించారు. ముఖ్యంగా ChatGPT సంస్థకు చెందిన Codex సాఫ్ట్‌వేర్ సాయంతో వెబ్‌సైట్ ప్రోటోటైప్‌ను రూపొందించి, అవసరమైన మార్పులు చేస్తూ తుది రూపం తీసుకొచ్చారు. ఇందుకోసం ఏపీ ఆర్టీసీ బస్సుల లైవ్ ట్రాకింగ్‌కు సంబంధించిన GPS డేటాను ఉపయోగించారు. మొదట విశాఖపట్నం బస్సులకే పరిమితమైన ఈ సేవకు మంచి స్పందన రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల బస్సుల వివరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా విస్తరించారు.
త్వరలో మొబైల్ యాప్‌గా అందుబాటులోకి
ప్రస్తుతం ‘ఫైండ్ మై బస్’ వెబ్‌సైట్ రూపంలో అందుబాటులో ఉంది. త్వరలో దీన్ని మొబైల్ అప్లికేషన్‌గా కూడా తీసుకురావాలని జ్ఞానేష్ భావిస్తున్నారు. ఐఓఎస్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలోనూ ప్రయాణికులకు ఈ సేవలను అందించాలనేది ఆయన లక్ష్యం. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీతో కలిసి పనిచేసి ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారు.
తాను కళాశాల రోజుల్లో ఎదుర్కొన్న చిన్న సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడే స్థాయికి చేరుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తే సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో జ్ఞానేష్ ప్రయత్నం నిరూపిస్తోంది.
Be the first to react