రైల్వే నిర్లక్ష్యానికి భారీ మూల్యం.. జమ్మూ దంపతులకు పరిహారం చెల్లించాలని తీర్పు..
Missed Flight Due to Train Delay: రైలు ఆలస్యం కారణంగా విమానాన్ని అందుకోలేక ఆర్థికంగా నష్టపోయిన జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం ఊరటనిచ్చింది. రైల్వే శాఖ సేవల్లో లోపం ఉందని నిర్ధారించిన కమిషన్.. బాధితులకు రూ.63 వేలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర రైల్వే, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పొగమంచు కారణంగా రైలు ఆలస్యమైందన్న రైల్వే శాఖ వాదనను కూడా కమిషన్ అంగీకరించలేదు. ఈ మేరకు ఈ నెల 4న తుది తీర్పు వెలువరించింది.
రైలు ఆలస్యంతో విమానం మిస్.. జమ్మూ దంపతులకు రూ.63 వేలకు పైగా పరిహారం.. రైల్వే శాఖకు వినియోగదారుల ఫోరం షాక్!
రైలు ఆలస్యం కారణంగా విమానాన్ని అందుకోలేక ఆర్థికంగా నష్టపోయిన జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం ఊరటనిచ్చింది. రైల్వే శాఖ సేవల్లో లోపం ఉందని నిర్ధారించిన కమిషన్.. బాధితులకు రూ.63 వేలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర రైల్వే, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పొగమంచు కారణంగా రైలు ఆలస్యమైందన్న రైల్వే శాఖ వాదనను కూడా కమిషన్ అంగీకరించలేదు. ఈ మేరకు ఈ నెల 4న తుది తీర్పు వెలువరించింది.
జమ్మూకు చెందిన మోహిత్ సింగ్ భౌ, ఆయన భార్య దామిని బిల్లోరియా 2022 డిసెంబర్ 19న జమ్మూ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో (రైలు నంబర్ 12266) టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20వ తేదీ తెల్లవారుజామున 3:55 గంటలకు రైలు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అదే రోజు ఉదయం 7:15 గంటలకు ఢిల్లీ నుంచి గువాహటికి వెళ్లే విమానానికి కూడా ఈ దంపతులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. రైలు సమయానికి చేరుకుంటే విమానాన్ని సులభంగా అందుకోవచ్చని భావించారు.
అయితే వారి ప్రయాణ ప్రణాళిక రైలు ఆలస్యంతో తలకిందులైంది. దురంతో ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయానికి కాకుండా ఏకంగా 3 గంటల 55 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ చేరుకుంది. అప్పటికే గువాహటికి వెళ్లాల్సిన విమానం బయలుదేరే సమయం దాటిపోవడంతో దంపతులు దాన్ని అందుకోలేకపోయారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం వారు అదనంగా రూ.35,699 ఖర్చు చేశారు. అంతేకాకుండా అదే రాత్రి ఢిల్లీలోని హోటల్లో బస చేసేందుకు మరో రూ.2,500 వెచ్చించారు.
రైలు ఆలస్యం వల్ల విమాన ప్రయాణం మిస్ కావడం, అదనపు ఖర్చులు భరించాల్సి రావడం ఆ దంపతులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. ఆర్థిక నష్టంతో పాటు మానసిక వేదనకు గురైన వారు న్యాయం కోసం జమ్మూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ సమయంలో రైల్వే శాఖ తన వాదనలను కమిషన్ ముందు ఉంచింది. రైళ్ల ఆలస్యానికి సంబంధించి నిబంధనల ప్రకారం తమపై బాధ్యత ఉండదని తెలిపింది. ముఖ్యంగా ఆ సమయంలో పొగమంచు వంటి సహజ పరిస్థితుల కారణంగానే రైలు ఆలస్యమైందని వివరించింది. అయితే రైల్వే శాఖ వాదనలను కమిషన్ తోసిపుచ్చింది. కమిషన్ ప్రెసిడెంట్ పవన్ దేవ్ కొత్వాల్, సభ్యురాలు నీలం బాలా భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
రైలు ఆలస్యానికి తమ నియంత్రణకు మించిన కారణాలే కారణమని నిరూపించేందుకు రైల్వే శాఖ తగిన ఆధారాలు సమర్పించలేదని కమిషన్ అభిప్రాయపడింది. అంతేకాకుండా కేసులో సకాలంలో లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయడంలోనూ రైల్వే శాఖ విఫలమైందని పేర్కొంది. కేవలం పొగమంచు కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పడం సరిపోదని, అందుకు తగిన ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు అందించాల్సిన సేవల్లో లోపం జరిగిందని కమిషన్ తేల్చింది. బాధిత దంపతులు అదనంగా ఖర్చు చేసిన రూ.38,199 మొత్తాన్ని 7.5 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఈ వడ్డీని 2023 ఫిబ్రవరి 13వ తేదీ నుంచి లెక్కించాలని తీర్పులో పేర్కొంది.
ఇక్కడితో పరిహారం పరిమితం కాలేదు. రైలు ఆలస్యం కారణంగా విమానం మిస్ కావడం, అనుకోని ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సి రావడం వల్ల దంపతులు ఎదుర్కొన్న మానసిక వేదనకు రూ.20,000 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. కేసు కోసం వారు చేసిన న్యాయపరమైన ఖర్చులకు మరో రూ.5,000 ఇవ్వాలని స్పష్టం చేసింది. మొత్తం పరిహారం, ఖర్చులు, వడ్డీ కలిపి రూ.63 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఉత్తర రైల్వే, కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.
ఈ తీర్పు రైలు ప్రయాణాల్లో ఆలస్యం వల్ల నష్టపోయే ప్రయాణికులకు కీలకమైన ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది. రైలు ఆలస్యానికి సరైన కారణాలు, ఆధారాలు చూపించకుండా సహజ పరిస్థితులను సాకుగా చెప్పడం సమర్థనీయం కాదని ఈ కేసు స్పష్టం చేస్తోంది. ప్రయాణికులకు కలిగే నష్టాలపై బాధ్యత వహించాల్సిన సందర్భాల్లో రైల్వే శాఖ కూడా జవాబుదారీగా ఉండాలని వినియోగదారుల ఫోరం తీర్పు ద్వారా మరోసారి గుర్తుచేసింది.