బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (RTC super luxury bus) కావలి నుంచి బెంగళూరుకు బయలుదేరింది.
ఈక్రమంలో తెల్లవారుజామున అన్నమయ్య (Annamayya) జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోకి రాగానే డ్రైవర్ రసూల్(50)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన స్టీరింగ్పై కుప్పకూలారు.
బస్సు రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోవడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాద స్థలం నుంచి బస్సును రాయచోటి ఆర్టీసీ డిపోనకు తరలించారు. రసూల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించారు. సంఘటనా స్థలాన్ని ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.